Land grab by YCP leaders: అనంతపురం గ్రామీణ మండలం సోమలదొడ్డిలో గత ప్రభుత్వ హయాంలో పేదలకు పంపిణీ చేసిన పట్టాలను.... వైసీపీ నాయకులు మరొకరికి విక్రయిస్తున్నారు. 2014లో సర్వే నంబర్ 97లో 190 మందికి ఇంటి పట్టాలు మంజూరు చేశారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు... మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. ఇదే అదునుగా ఆ గ్రామానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు వాటిని విక్రయిస్తున్నారు. ఒక్కో ప్లాటుకు రూ.15 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 వరకు గుడిసెలు వేశారు. ఇటీవల రెవెన్యూ అధికారులు వెళ్లి హెచ్చరించినా.. నిర్మాణాలు ఆగలేదు.
కోట్ల రూపాయలు విలువ చేసే ఖాళీ స్థలాలను దోచుకునేందుకు వైసీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారు. ఆరు నెలల క్రితం కర్రలతో కొన్ని గుడిసెలు వేయించారు. ఎలాంటి అవాంతరాలు రాకపోవడంతో పక్కాగా ఇళ్లు కట్టుకోవడానికి అందరూ సిద్ధమయ్యారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకుంటే... తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ కుల సంఘం నాయకులను ఉసిగొల్పి అక్రమంగా గుడిసెలు వేయిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ ఎమ్మెల్యే పేరు చెప్పి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. గతంలో పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయలేదని... అక్రమంగా గుడిసెలు వేసిన వారికి హెచ్చరికలు జారీ చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కుల సంఘనాయకులు అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో ఇక్కడికి వచ్చారని ప్రశ్నించారు.
ఇవీ చదవండి: