బంధువునంటూ నమ్మించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అనంతపురం జిల్లా తాడిపత్రి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన మస్తాన్ వలి ఐటీఐ వరకు చదువుకుని ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. తాగుడు, పేకాట, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడిన అతడు ... ఆ వ్యసనాల కోసం నేరాలకు పాల్పడటమే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. పల్లెల్లో వృద్ధ మహిళలతో మాట్లాడుతూ దూరపు బంధువనని నమ్మించి వారు ధరించిన బంగారు ఆభరణాలు బాగున్నాయని కితాబిస్తూనే... అదే తరహాలో తాను నగలు చేయిస్తానని చెప్పి వాటిని తీసుకుంటాడు. వారు ఒకవేళ ఇవ్వకపోతే బలవంతంగా లాక్కుని పారిపోయేవాడు. ఇలా 2017నుంచి సుమారు 26చోట్ల నేరాలకు పాల్పడిన మస్తాన్ వలిని అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.40 లక్షలు విలువ చేసే కిలో 14 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి...తూకంలో తేడా.. పత్తి వ్యాపారి మోసం