ఇసుక కొరతను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. ట్రాక్టర్లతో కదలి వచ్చి విన్నూత నిరసన ర్యాలీ చేపట్టారు. పాత గుంతకల్లు నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు మానవహారంగా ఏర్పడి ధర్నా చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఆరు మాసాలుగా ఉపాధి లేక కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంతకల్లు పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్నకు వినతిపత్రం అందజేశారు. సుమారు 30 వేల కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని వాపోయారు. వైకాపా ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మద్దతుతోనే ఈ ధర్నా చేపట్టినట్లు అదే పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ చెప్పడం గమనార్హం. వైకాపా సర్కార్ నూతన ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని ఆయన విమర్శించారు. మూడు రోజుల్లో ఇసుక రవాణా చేస్తామని కమిషనర్ బండి శేషన్న హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.
ఇదీ చదవండి:రేపు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన