రాష్ట్రంలో కరోనా రోగులు వైద్యం అందక మృత్యువాత పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. వైద్యఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై భాజపా శ్రేణులతో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చి వైద్యం అందక చెట్టుకింద బాధితుడు చనిపోయిన...ఘటన దేశంలో ఎక్కడైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. అనంతపురం ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలెండర్ల కొరత కారణంగా రోగులు చచ్చిపోతున్నారంటూ విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
అత్యవసర వైద్యానికి తరలించటానికి 108 సేవల అంబులెన్సులకు ఫోన్ చేస్తే 24 గంటలైనా రోగిని తీసుకెళ్లటానికి రావటంలేదని ఆరోపించారు. కరోనా వైరస్ ను అరికట్టడంలోనూ, రోగులకు వైద్యం అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ తక్షణమే ఆ శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని విష్ణవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు