వైకాపా, భాజపా స్నేహ బంధం ఎంత గట్టిదో ఇప్పటికే పలుమార్లు చెప్పామని ఏపీసీసీ అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పేర్కొన్నారు. ఇప్పుడు వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడంతో వైకాపా, భాజపా స్నేహ బంధం మరోసారి బయటపడిందని ఆరోపించారు. మండలి సెలెక్ట్ కమిటీలో, కోర్టులో ఉన్న బిల్లులను ఏ విధంగా ఆమోదించారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. రెండు బిల్లులను గవర్నర్ ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదిస్తున్నామని చెప్పి... అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. భాజపా, వైకాపా రెండు పార్టీలు ఒకటేనని శైలజానాథ్ ఆరోపించారు. అమరావతి రైతుల త్యాగానికి అర్థం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం, రాజధాని పరిరక్షణకు భాజపాను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...