అనంతపురం జిల్లా కదిరిలో అత్తామామలే తన భార్యకు వేరే పెళ్లి చేశారని భర్త పోలీసులను ఆశ్రయించాడు. కదిరి పట్టణానికి చెందిన చంద్రకు ఓబులదేవరచెరువు మండలం తిట్టేపల్లికి చెందిన అక్క కూతురితో నాలుగు సంవత్సరాల కిందట పెళ్లైంది. అప్పటి నుంచి భార్య ఎక్కువ కాలం పుట్టింట్లోనే ఉండిపోయింది. కాపురానికి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక వంక చెప్పేదని బాధితుడు వాపోయాడు. అక్క కూతురే కదా కొద్ది రోజులు ఓపిక పడితే అన్ని సర్దుకుంటాయని భావించి పుట్టింటిలోనే వదిలి వచ్చానని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
వెళ్లి చూస్తే..!
రెండు నెలల కిందట అత్త వారింటికి వెళితే అక్కడ తన భార్య లేకపోవడాన్ని చూసి అత్తమామలను నిలదీశానని చెప్పాడు. పెద్దమనుషులను వెంట తీసుకెళ్లి ప్రశ్నిస్తే అత్తామామలే తన భార్యకు రెండో పెళ్లి చేసినట్లు తెలిసిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు తన అత్తమామలపై చర్యలు తీసుకుని భార్యను అప్పగించాలని పోలీసులను వేడుకున్నారు. మొదట ఓబులదేవరచెరువు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్కడికి వెళ్లి కేసు నమోదు చేయించుకోవాలని పట్టణ పోలీసులు బాధితుడికి సూచించారు.