శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 54 కొత్తకేసులు బయటపడటంతో... మొత్తం సంఖ్య 1887కి చేరింది. నిన్న అధికంగా అనంతపురం జిల్లాలో 16, విశాఖ జిల్లాలో 11, పశ్చిమగోదావరి జిల్లాలో 9 నమోదయ్యాయి. మరోవైపు ఇటీవల వరకూ కేసులు విపరీతంగా విజృంభించిన కర్నూలు జిల్లాలో గత 2 రోజులుగా ఏడేసి కేసులే నమోదు కావటం కాస్త ఉపశమనాన్ని కలిగించింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 547కి చేరింది. ఇవాళ జిల్లాలో పర్యటించనున్న కేంద్రబృందం నివారణ చర్యలను సమీక్షించి తగు సాంకేతిక సూచనలు చేయనుంది.
నరసరావుపేటలో 333 కేసులు
గుంటూరు జిల్లాలో మొత్తం 374 మంది బాధితులుండగా కేవలం గుంటూరు, నరసరావుపేటలోనే 333 కేసులు గుర్తించారు. జిల్లాలోని 20 కంటైన్‌మెంట్ జోన్లలో పటిష్ఠంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో నేడు కేంద్రబృందం పర్యటించనుంది. వాస్తవానికి వారు శుక్రవారమే రావాల్సి ఉన్నా రాలేదు. వారికి ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు యంత్రాంగం అన్ని రకాల నివేదికలు సిద్ధం చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులో ఇప్పటిదాకా 7 పాజిటివ్ కేసులు నమోదవగా ముగ్గురు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. మరో 28 రోజులు కేసులు నమోదు కాకుంటే గ్రీన్‌జోన్‌లోకి వెళ్తామని ప్రజలంతా సహకరించాలని కోరారు.
తునిలో అందరికీ నెగిటివ్
తూర్పుగోదావరి జిల్లా తునిలో మే ప్రారంభం నుంచి వందలాది మందికి నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 1న 3 పాజిటివ్ కేసులు వెలుగుచూశాక వారి కుటుంబసభ్యులు, ఇతర కాంటాక్టులను పరీక్షించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పలు దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు మాస్కు లేనివారికి నిత్యావసరాలు ఇవ్వొద్దని ఆదేశించారు. అనంతపురం శివార్లలోనే పాపంపేట ఉర్దూ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు యోచనకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి