పాడి రైతుల నుంచి పాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అముల్ డెయిరీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచినప్పటికీ, రైతుల నుంచి మాత్రం పాలు సేకరించనున్నట్లు సమాచారం. తొలి దశలో అముల్ సంస్థ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాల సేకరణకు సమాయత్తమైంది. ఈనెల 25 నుంచి పాలు సేకరిస్తున్న జాబితాలో అనంతపురం జిల్లాను చేర్చలేదు. అయితే ఇప్పటికే పాలు పోసిన రైతులకు రూ.60 లక్షలు బకాయిపడ్డ అనంతపురం సహకార డెయిరీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి మూతపడింది. అముల్ డెయిరీ సహకారం అందుతుందని ఆశగా ఎదురుచూసిన పాడి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ అనంతపురం డెయిరీ పరికరాలు కడప జిల్లాకు తరలిపోతున్నాయి. మూడు జిల్లాల్లో మాత్రమే పాల సేకరణ చేస్తున్నట్లు అముల్ ప్రతినిధులు ఆయా జిల్లాల అధికారులతో చెబుతుండగా..,అనంతపురం జిల్లా అధికారులకు మాత్రం ప్రభుత్వం నుంచి కానీ, అముల్ నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు.
అముల్ ప్రతినిధులు రెండు నెలల క్రితమే అనంతపురం డెయిరీకి వచ్చి ఇక్కడి యంత్రాలు పరిశీలించి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. జిల్లాలో ఇప్పటికే 38 బల్క్ కూలింగ్ యూనిట్లు(బీసీయూ) ఉన్నాయి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాల సేకరణ చేసి, నిల్వచేసే ఈ యూనిట్లన్నీ మూతపడ్డాయి. పశుసంవర్థకశాఖ, డీఆర్డీఏ, డెయిరీ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అముల్ అధికారులతో సమావేశమై జిల్లాలో పశువుల సంఖ్య, పాల ఉత్పత్తి, మహిళా సంఘాల వివరాలను నివేదిక ఇచ్చారు. అనంతపురం, హిందూపురం డెయిరీలు మూతపడటానికి కారణాలను డెయిరీ అధికారులు వివరాలిచ్చారు. రెండు లక్షల లీటర్ల వరకు పాలసేకరణ, నిల్వ సామర్థ్యం ఉన్న ఈ రెండు డెయిరీలు మూతపడిన వైనాన్ని వివరించారు. ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న అముల్ తొలి దశ కార్యకలాపాలు ప్రారంబించే జిల్లాల్లో అనంతపురాన్ని చేర్చలేదు. జిల్లాలో పాల ఉత్పత్తి, ఇతర వివరాలు ఇచ్చినట్లు పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు.
అనంతపురం డెయిరీ సామగ్రిని కడప జిల్లాకు తరలిస్తున్న అధికారులు, జిల్లాలో ఎప్పటినుంచి అముల్ డెయిరీ పాలసేకరణ ప్రారంభిస్తుందని మాత్రం చెప్పలేకపోతున్నారు. జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సైతం ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.
ఇదీచదవండి