Murudi Village Farmers: అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో పొలాలకు దారి చూపే విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దారి ఇవ్వబోమని రైతుల తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడి కోసం తమ పొట్ట కొడుతున్నారంటూ ఒక దశలో సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. బాధితుల వివరాల మేరకు... మురడి గ్రామంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సోదరుడు కొండారెడ్డికి మూడెకరాల పొలం ఉంది. అక్కడికి వెళ్లేందుకు దారి చూపాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఆయన కోరిన మార్గంలో ఐదుగురు రైతుల డి.పట్టా పొలాలున్నాయి. అందులోంచి దారిస్తే భూములు దెబ్బతింటాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న దారిని కొనసాగించాలని పలుమార్లు రైతులు అధికారులకు తెలియజేశారు.
పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది, పోలీసులు బుధవారం అక్కడికి చేరుకుని దారి కొలతలకు ప్రయత్నించారు. దీంతో రైతులు నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో బాధితులు గిరియమ్మ, శివనాగమ్మ, నాగవేణి, అంజినయ్య, ధనుంజయ అక్కడినుంచి వెళ్లి పొలాల్లో దాచుకున్న పురుగుమందు డబ్బాలు తీసుకుని తాగేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి, పురుగుమందు తాగకుండా అడ్డుకునే క్రమంలో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం అక్కడికక్కడే బాధితులకు నోటీసులు ఇచ్చి, రోడ్డు ఏర్పాటుకు సర్వే చేపట్టారు.
దారి నిర్మాణానికి, ఎమ్మెల్యే సోదరుడికి సంబంధం లేదు...
"సర్వే నంబరు 7, 8లలో ఉన్న 100 ఎకరాలకు దారి ఏర్పాటు చేయాలని రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అందుకే సర్వే చేపట్టాం. రైతులు చెప్పిన రెండు మార్గాలనూ పరిశీలిస్తాం. దారి నిర్మాణానికి, ఎమ్మెల్యే సోదరుడికి సంబంధం లేదు" - బాలకిషన్, డి.హీరేహాళ్ తహసీల్దారు
ఇదీ చదవండి : తిరుమలలో కిడ్నాప్‌నకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం