AP CRIME NEWS: వివాహ వేడుకకు వెళ్లి వస్తూ.. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీ.. కారును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన వెంకటప్పనాయుడి కుమార్తె ప్రశాంతి వివాహం ఆదివారం బళ్లారిలో జరిగింది. బంధువులంతా కలిసి కారులో వేడుకకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు.
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..
అనంతపురం - బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి - కొట్టాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును వేగంగా ఢీకట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బయటకు తీయలేనంతగా మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన పొక్లెయిన్లు తెప్పించి మృత దేహాలను బయటకు తీశారు.
ఒకే కుటుంబానికి చెందిన..
ప్రమాదంలో పెళ్లికుమార్తె తండ్రి వెంకటప్పనాయుడితో పాటు ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన స్వాతి, జశ్వంత్, జాహ్నవి, కణేకల్లు మండలానికి చెందిన రాధమ్మ, బొమ్మనహాళ్‌కు చెందిన సరస్వతి, అశోక్, బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన శివమ్మ, రాయలదొడ్డికి చెందిన సుభద్రమ్మ చనిపోయారు.
వీరిలో సరస్వతికి స్వాతి, అశోక్ సంతానం. స్వాతికి ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి జశ్వంత్, జాహ్నవి కవల పిల్లలు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడంతో బంధువుల దుఃఖం కట్టలు తెగింది. రెండు భాగాలుగా ఛిద్రమైన జశ్వంత్ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. బంధువుల రోదనలతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఘటనా స్థలంలో ఎస్పీ ఫకీరప్ప పరిశీలన..
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఫకీరప్ప పరిశీలించారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైకాపా ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బాధితులను పరామర్శించారు. బంధువులను ఓదార్చారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
రోడ్డు ప్రమాద దుర్ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నందునే ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆరోపించారు.