Police Crack Down on Nakkapalli Pension Robbery Case : అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని హెటిరో కంపెనీకి వెళ్లే రోడ్డులో జరిగిన దారి దోపిడీలో పింఛను నగదు (Pension Money Robbery Case) కాజేసిన కేసులో జానకయ్యపేట సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ కీలక పాత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఎస్పీకేవీ మురళీకృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Secretariat Employee Key Role in Nakkapalli Robbery Case : ఎస్పీ కథనం ప్రకారం : ఆగస్టు 31వ నక్కపల్లి హెటిరో కంపెనీకి వెళ్లే రహదారిలోదారి దోపిడీ జరిగింది. సచివాలయం డిజిటల్ ఆసిస్టెంట్ అలజంగి నానిబాబు.. వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావుతో కలిసి నక్కపల్లి ఐఓబీ బ్యాంకులో పింఛన్ల చెల్లింపులకు 13.05 లక్షల రూపాయలు విత్‌డ్రా చేశారు. బైక్‌పై వీరు వస్తుండగా మార్గ మధ్యలో నగదు కాజేయాలని నానిబాబు పన్నాగం పన్నాడు. దీనికి గాజువాక, మల్కాపురం ప్రాంతాలకు చెందిన తన స్నేహితులు దేవిరెడ్డి సాయికుమార్ చందక సాయి ఎలియాస్ స్టీఫెన్ సాయం కోరాడు.
Road Robbery in Anakapalli District: సచివాలయ సిబ్బంది కళ్లలో కారం కొట్టి.. రూ.14 లక్షలు అపహరణ
పింఛన్ నగదు తీసుకొస్తుండగా ఎలా చోరీ చేయాలో రెండు రోజుల క్రితం రెక్కీ నిర్వహించి అదే రోజు తెల్లవారుజామున ముగ్గురూ పథకం వేశారు. ఈ నేపథ్యంలో 31న నగదు విత్ డ్రా చేసి వస్తుండగా హెటిరో కంపెనీకి వెళ్లే దారి లోని మొదటి స్పీడ్ బ్రేకర్ వద్ద నిందితులు దేవిరెడ్డి సాయికుమార్, చందక సాయి ఇద్దరూ వేచి ఉన్నారు. వీరికి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ నానిబాబు చరవాణి నుంచి పింఛన్ నగదు తీసుకుని వస్తున్నామని సందేశం వచ్చింది.
అప్పటికే కారం డబ్బాతో వేచి ఉన్న నిందితులు ద్విచక్ర వాహనం నడుపుతున్న సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు కళ్లల్లో కారం కొట్టాడు. ఇతను కింద పడిపోవడంతో వెనక కూర్చున్న నాని బాబు నగదు తీసుకెళ్లమని స్నేహితులకు చెప్పడంతో ఇద్దరూ నగదుతో కోటవురట్ల రోడ్డులో బైక్‌పై వెళ్లిపోయారు. నిందితులు దారి దోపిడీకి వినియోగించిన బైక్‌ను పోలిన మరో వాహనం నంబరు ప్లేట్‌ను పెట్టి పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశారు.
Gold Shop Robbery Viral Video : నగల దుకాణంలో చోరీ.. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు.. ఆఖరికి..
కేసులో సమగ్ర విచారణ చేసిన నక్కపల్లి పోలీసులు సూత్రధారి సచివాలయం ఉద్యోగని తేల్చి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసుకు సంబంధించి జానకయ్యపేట డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న గాజువాక హౌసింగ్ కాలనీకి చెందిన అలజంగి నానిబాబు, ఇదే ప్రాంతానికి చెందిన దేవిరెడ్డి సాయికుమార్, మల్కాపురానికి చెందిన చందక సాయి అలియాస్ స్టీఫెన్లను అరెస్ట్ చేసి వీరి నుంచి రూ. 12.92 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో : ఈ ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో దారి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు విచారణ వెల్లడైంది. నానిబాబు మూడేళ్లుగా సచివాలయంలో పని చేస్తుండగా, సాయికుమార్ ఎలక్ట్రిషియన్. వీరిద్దరూ నాలుగో తరగతి నుంచి స్నేహితులు, నానిబాబు ఇంజినీరింగ్ పూర్తి చేయగా, సాయికుమార్ డిగ్రీ తప్పాడు. మల్కాపురానికి చెందిన చందక సాయి. వీరికి జూనియర్. ఈ ముగ్గురూ గాజువాకలో ప్రతి ఆదివారం కలుసుకునేవారు. చెడు అలవాట్లు, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు కాజేయాలని ఆలోచన చేసి పోలీసులకు చిక్కారు.
చోరీ జరిగాక తనకు ఏమీ తెలియనట్లుగా సచివాలయ ఉద్యోగి నానిబాబు వ్యవహరిస్తూ పోలీసుల విచారణలో విషయాలను ఎప్పటికప్పుడు తన స్నేహితులకు చెప్పేవాడు. నిందితులు చెన్నైకు విమానంలో వెళ్లారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వీరిని పట్టుకుని కాజేసిన పింఛన్ నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నక్కపల్లి సీఐ అప్పన్న, నర్సీపట్నం రూరల్ సీఐ పి. రమణయ్య, బుచ్చెయ్యపేట సీఐ కె.కుమారస్వామిలతో పాటు ఎస్సైలను ఎస్పీ అభినందించారు.