No medical services for tribals: అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గిరిజనులు వైద్యం అందక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సమీప ప్రాంతంలో పీహెచ్సీలు లేక వైద్యం కోసం వెళ్లడానికి పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. గర్భిణీలకు సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డా ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. వైద్య సదుపాయాలపై ఎన్నికల హామీలు నెరవేర్చడంలో నేతలు మిన్నకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యం కోసం రోజుకో అవస్థ..: నిన్న రోలుగుంట మండలం పెద్దగరువు, నేడు రావికమతం మండలం సరి సింగం, మొన్న జడ్జ్ జోగంపేట ఇలా రోజుకోచోట గిరిజనులు వైద్యం కోసం నానా అవస్థలు పడుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధుల్లో చలనం ఉండటం లేదు. ఎన్నికల సమయంలో గిరిజనుల సంక్షేమంపై ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీల ఎక్కడా నెరవేరడం లేదు. ఫలితంగా ఏళ్ల తరబడి రాయి, రప్పా, తుప్ప, డొంక, కొండలు, గుట్టలు డోలిమాతలతో కాలినడకన వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
బాలింతకు వైద్యం అందక పసిబిడ్డ మృతి..: రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని పెద్ద కరువు గ్రామానికి చెందిన బాలింత కమలకు సరైన వైద్యం సకాలంలో అందక తన పసిపాపను కోల్పోయిన విషాదకర సంఘటన అందరిని కలచివేసింది. తాజాగా రావికమతం మండలం చలిసింగం గ్రామానికి చెందిన గంగాదేవి అనే బాలింత వైద్యం కోసం డోలిమాతపై సుమారు నాలుగు కిలోమీటర్లు పయనించాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యయప్రయాసలకు ఓర్చి ఆస్పత్రికి చేరినా నవమాసాలు మోసి జన్మనిచ్చినప్పటికీ ఆ పసిగుడ్డు విగతజీవి కావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
490 కుటుంబాలకు రహదారి ఏదీ..: సుమారు 490 కుటుంబాలు ఏళ్ల తరబడి జీవనం సాగిస్తున్న రావికమతం మండలంలోని గిరిజన గ్రామమైన చలి సింగంకు రహదారి సదుపాయం కల్పించాలన్న డిమాండ్ నెరవేరడం లేదు. ఎన్నాళ్లుగానో అక్కడి గిరిజనులు ఎన్నో విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకునే నాధుడు లేదు. ఆయా ఎన్నికల సమయాల్లో నాయకులు ఇస్తున్న హామీలు ఏ ఒక్కటీ నెరవేరడం లేదు.
అటవీశాఖ నిర్వాకంతో మురిగిపోయిన నిధులు..: 2019 సంవత్సరంలో చలి సింగం గ్రామానికి తారురోడ్డు వేసేందుకు కోటి 90 లక్షలు మంజూరైనప్పటికీ అటవీ అధికారుల నుంచీ అనుమతులు లభించక నిధులు మురిగిపోయాయి. ఈ కారణంగా గ్రామస్తులు రాయి, రప్ప కొండ, గుట్ట తుప్ప, డొంకలను దాటుకుంటూ వైద్యం కోసం వెళ్ళడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ గ్రామానికి చెందిన గంగాదేవి తన రెండో కాన్పు కింద బాలికను జన్మనిచ్చింది. అనారోగ్యం పాలైన తల్లి బిడ్డలను రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలిమాతతో సుమారు నాలుగు కిలోమీటర్లు అతికష్టంగా తీసుకువెళ్లాల్సి వచ్చింది.
గిరిజనుల గోడు పట్టించుకోరా?..: చోడవరం నియోజకవర్గంలోని రావికమతం, రోలుగుంట మండలాల్లో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నప్పటికీ పాలకుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు ఎప్పటికప్పుడు తమ అవస్థలను ప్రభుత్వానికి విన్నవిస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. ప్రధానంగా గిరిజనులకు అందాల్సిన వైద్యం విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి