Pollution: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఎన్.నర్సాపురంలో దశాబ్దన్నర కిందట.. 300 ఎకరాల్లో హెటిరో మందుల పరిశ్రమ నెలకొల్పారు. తర్వాత 450 ఎకరాలకు కంపెనీని విస్తరించారు. ఈ పరిశ్రమలో వివిధ రకాల ఔషధాల తయారీకి అవసరమైన ముడి సరకుని తయారు చేస్తుంటారు. అరకొరగా శుద్ధిచేసిన రసాయన జలాలను పైపుల ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్నారని నక్కపల్లి మండల వాసులు ఆరోపిస్తున్నారు.
రసాయన జలాల వల్ల చేపలు తీరం నుంచి దూరం వెళ్లిపోయి.. వలలకు చిక్కడం లేదని అంటున్నారు. పట్టిన చేపలకు కూడా వాసన వస్తుందని.. ఎవరూ కొనడం లేదని.. ఉపాధి లేక వలస వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు.
హెటిరో పరిశ్రమ.. సముద్రంలోకి వేసిన పైపులైన్లను పూర్తిగా తొలగించాలని గతేడాది డిసెంబర్ నుంచి మత్స్యకారుల ఐకాస ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపడుతున్నారు. ఎన్జీటీలో కేసు కూడా వేశారు. పరిశ్రమ వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని చుట్టుపక్కల గ్రామాల వాసులు వాపోతున్నారు. నక్కపల్లి, ఉపమాక, ఎన్.నర్సాపురం, నల్లమట్టిపాలెం, చందనాడ, తీనార్ల, జానకయ్యపేట, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, సీహెచ్ లక్ష్మీపురం, అయ్యన్నపాలెం గ్రామాలపై ఈ పరిశ్రమ కాలుష్య ప్రభావం కనిపిస్తోందని వారు అంటున్నారు.
నీరు, వాయు కాలుష్యం వల్ల.. క్యాన్సర్, చర్మ, కిడ్నీ సంబంధ వ్యాధులతో అనారోగ్యం పాలవుతున్నాం. పరిశ్రమ వ్యర్థాలు చేపలకు ముప్పుగా పరిణమించాయి. సముద్రంలోకి ఎలాంటి పైపులైన్లు వేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి.. సముద్రంలోకి రసాయన జలాలు కలవకుండా చూడాలి -మత్స్యకారులు
ఎన్జీటీ నియమించిన జాయింట్ కమిటీ.. ఈ కంపెనీ పరిసర గ్రామాల్లో పరిశీలించి.. కాలుష్య నియంత్రణలో ఉల్లంఘనలను గుర్తించిందని మత్స్యకారులు చెబుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలు చేపలకు ముప్పుగా పరిణమించాయని అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు. సముద్రంలోకి ఎలాంటి పైపులైన్లు వేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి.. సముద్రంలోకి రసాయన జలాలు కలవకుండా చూడాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి: