Farmer's money in YCP leader's account : అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఆబోతు మహాలక్ష్మి అనే వ్యక్తికి సర్వేనెంబర్ 483లో మూడెకరాల అసైన్డ్ భూమి ఉండేది. డిపట్టా మాత్రం 2.10 ఎకరాలకు మాత్రమే ఉంది. మిగతా 90 సెంట్ల భూమికీ పట్టా కోసం కొన్నేళ్లుగా మహలక్ష్మి తిరగని కార్యాలయమే లేదు. ఆక్రమణలో ఉన్న భూమికి హక్కులు కల్పించకపోగా ఉన్న 2.10 ఎకరాల అసైన్డ్ భూమిని గతేడాది జగనన్న కాలనీ కోసమంటూ తీసుకున్నారు. మిగతా రైతుల భూములను వదిలేసి ఊరికి దూరంగా ఉన్న మహలక్ష్మి భూమినే లక్ష్యంగా చేసుకుని వైకాపా నాయకుడు, మాజీ సర్పంచి మొల్లి సోమినాయడు, అప్పటి రెవెన్యూ అధికారులు ఈ దందా నడిపించారు. రైతు మహాలక్ష్మికి కుటుంబం, ఇల్లు ఏదీ లేదు....ఒంటరిగానే ఉంటున్నాడు. రాత్రిళ్లు విద్యుత్తు ఉపకేంద్రం వద్ద తలదాచుకొని.. పగలు జీడి తోటల కాపలాకు వెళ్లిపోతుంటాడు. ఇదే అదునుగా ఇతని భూమి తీసుకున్నా అడిగేవారు ఉండరనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో భూబాగోతానికి తెరలేపినట్లు తెలుస్తోంది.
మహాలక్ష్మికి తన భూమిని జగనన్న కాలనీకి ఇచ్చే ఉద్దేశమే లేదు. కాని ప్రభుత్వ భూమి కావడంతో బలవంతంగా తీసుకున్నారు. డబ్బులు ఎంత ఇచ్చేది రైతుకు చెప్పలేదు. గతేడాది జనవరి 25న మహాలక్ష్మి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం... 72 లక్షలు 18 వేల రూపాయలు పరిహారంగా జమచేసింది. 2 రోజుల తర్వాత మాజీ సర్పంచి సోమినాయుడు, రైతును బ్యాంకు దగ్గరకు తీసుకువెళ్లి వేలిముద్రలు వేయించి అదే బ్యాంకులో సోమినాయుడు ఖాతాకు 40 లక్షలు ఒకసారి, తనపేరిటే మరో బ్యాంకులో ఉన్న ఖాతాకు మరో 29 లక్షల 68 వేలు మళ్లించేశాడు. సొంత ఇల్లు లేనందున జగనన్న కాలనీలో ఇళ్లు కట్టించి ఇస్తామని బ్యాంకు పుస్తకం, పాన్‌కార్డు, ఆధార్ కార్డును మాజీ సర్పంచి, వీఆర్వో బొడ్డు శ్రీను తీసుకుని మోసం చేశారని రైతు వాపోతున్నాడు. ఇదే విషయం చోడవరం పోలీస్‌స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొన్నాడు.
ప్రభుత్వం పరిహారం రైతు మహాలక్ష్మి ఖాతాలో జమ చేసిందన్న వీఆర్వో లావాదేవీలతో తమకు సంబంధం లేదన్నారు. ఇంటికోసం దరఖాస్తు చేసుకొంటే పరిశీలించి ప్రభుత్వం ఇస్తుందన్నారు.
రైతుకు తీవ్ర అన్యాయం జరిగిందన్న తెలుగుదేశం...అతడికి పరిహారం ఇచ్చే వరకూ పోరాటం చేస్తామని ప్రకటించింది.
మాజీ సర్పంచి సోమినాయుడు మాత్రం తానేమీ మోసం చేయలేదని చెబుతున్నారు. రైతు ఇదివరకే తన భూమిని అనకాపల్లికి చెందిన ఒకరికి అమ్మేశారని అవతల పార్టీ నుంచి తాను కొంత కాలం క్రితం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రికార్డుల పరంగా మహాలక్షి పేరిటే పరిహారం వస్తుంది కాబట్టి.. అతనికి చెప్పే పరిహారం సొమ్ము తీసుకున్నట్లు చెబుతున్నారు. రైతు మాత్రం తీసుకున్న భూమినైనా వెనక్కి ఇవ్వాలని..లేకుంటే ఇచ్చిన పరిహారమైనా చేతికి వచ్చేలా చూడాలని అధికారులను కోరుతున్నాడు.
ఇవీ చదవండి :
- ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగు వేసిన అధికారులు..!
- అర్ధరాత్రి తెదేపా నేత అరెస్ట్.. స్టేషన్ వద్దే దేవినేని ఉమ!
- కేన్స్‌లో దేవకన్య.. మతిపోగొట్టేస్తున్న బ్రెజిల్ మోడల్!