Childbirth in the light of torchlights: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు వెన్నాడుతున్నాయి. బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, బాలింతలు, గర్భిణులు విలవిల్లాడారు. జనరేటర్ ఉన్నా అది పనిచేయలేదు. ముఖ్యమైన విభాగాల్లో ఇన్వర్టర్లు రెండు గంటలు పనిచేశాక మొరాయించాయి. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో టార్చిలైట్ల వెలుగులో వైద్యులు ప్రసవం చేయాల్సి వచ్చింది. జనరేటర్ పాడైన విషయాన్ని విశాఖపట్నంలోని సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా.. ఉదయం మెకానిక్‌లు వచ్చి మధ్యాహ్నానికి బాగు చేశారు.
గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో జనరేటర్‌పై ఫ్యాన్లు, లైట్లు మాత్రం పనిచేశాయి. రాత్రి వేళ కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని రోగుల బంధువుల్లో కొందరు బ్యాటరీతో పనిచేసే టేబుల్ ఫ్యాన్లను కొనుక్కుని తెచ్చుకున్నారు. ఆసుపత్రిలో శుద్ధజలం ప్లాంటు మూడు రోజులుగా పనిచేయడం లేదు. రోగుల సహాయకులు ఇళ్ల నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుంటున్నారు. ఆసుపత్రి ఇన్‌ఛార్జి పర్యవేక్షకులు డాక్టర్ డేవిడ్ వసంత్‌కుమార్‌ను వివరణ కోరగా.. జనరేటరు, మోటారు పాడైనప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యుత్తు లేనప్పుడు ప్రసూతి విభాగంలో టార్చిలైట్లు, సెల్‌ఫోన్ల వెలుగులో ప్రసవం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. ‘ప్రసవాన్ని వాయిదా వేయలేం కదా’ అని పేర్కొన్నారు. శుద్ధజలం ప్లాంట్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.
ఇదీ చదవండి: పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు: ఎస్పీడీసీఎల్ సీఎండీ