Alluri District News: ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ చెట్టు కిందే జనమంతా గుమిగూడుతారు.. ఏ సమయంలో చూసినా ఈ చెట్టు కింద జనం పోగై ఉంటారు. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లి కొండ రహదారిలోని ఈ వృక్షం ఇక్కడ సెల్ టవర్‌లా పని చేస్తోంది. చుట్టుపక్కల 15 కిలోమీటర్ల లోపు సెల్ సిగ్నల్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. అందుకే..ఆన్లైన్లో క్లాసులైనా, సెల్ ఫోన్ చాటింగ్‌లైనా.. బ్యాకింగ్ అవసరాలైనా.. అందరూ ఇక్కడే వాలిపోతారు.
పింఛన్ తీసుకోవాలంటే వేలిముద్రాలు వేయాలి.ఊరిలో సిగ్నల్స్ లేకపోవడంతో బయోమెట్రిక్‌కు అంతరాయం కలుగుతోంది. పింఛన్ కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది.సేవల కోసం సుమారు 9 కిలోమీటర్లు దూరం వెళ్లాలి. గ్రామంలో ఫోన్లు కూడా సరిగా కలవవు. ప్రస్తుతం ఎలాంటి ఆన్లైన్ సేవలు కావాలన్న ఇక్కడికే రావాల్సి వస్తోంది. నెట్వర్క్ వంటి సమస్యల నుంచి బయట పడాలనుకునేవారికి ఈ చెట్టే దిక్కు అవుతుంది. అధికారులకు పలుమార్లు చెప్పినా ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సిగ్నల్స్ సదుపాయం కల్పించాలి. - స్థానికులు
మిత్రులతో సంభాషించడానికి, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి ఇక్కడికి వస్తుంటారు. మండల కేంద్రం దూరంగా ఉండటం, బ్యాంకు అందుబాటులో లేకపోవడంతో యూపీఐ లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ సేవల కోసం ఈ చెట్టు కిందకు రావాల్సి వస్తోంది. సమీపంలోని వారికి బయోమెట్రిక్ సేవలు అందాలన్నా ఈ చెట్టే దిక్కవుతోంది. యూట్యూట్‌లో టైలరింగ్ మెళకువలు తెలుసుకోవడానికి కూడా మహిళలు ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. సెల్ టవర్ కోసం అధికారులకు మొరపెట్టుకున్నా.. స్పందించడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: