అడ్డుకున్న పోలీసులు
రాజధాని అమరావతి కోసం ఎన్నో త్యాగాలు.. చేసిన రైతుల పట్ల ప్రభుత్వం వ్వవహరిస్తున్న తీరును మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం వద్ద "మూడు రాజధానులు వద్దంటూ అమరావతి ముద్దంటూ" కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ప్రదర్శనను అడ్డుకోవటంతో రోడ్డులో కొనసాగించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించే విధంగా రైతులను వేధించటం, నోటీసులివ్వటం దారుణమన్నారు.
నెల్లూరులో కాగడాల ప్రదర్శన
ఆరు నెలల వైకాపా పాలనపై సీఎం జగన్ దమ్ముంటే రెఫరెండానికి రావాలని మాజీ మంత్రి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. రాష్ట్రంలో అయోమయ పాలన నడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి రైతులకు మద్దతుగా నెల్లూరులో తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు కాగడాలు చేతపట్టి తెదేపా శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఇడుపులపాయలో రాజధాని పెట్టండి
అనంతపురం జిల్లా మడకశిరలో తెదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో సీఎం జగన్ తీరును నిరసిస్తూ కాగడాలతో నినాదాలు చేస్తూ.. ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఏకపక్షంగా ఎలా తరలిస్తారని.. కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. గురువారం రాత్రి కళ్యాణదుర్గంలో భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
తెదేపాపై కక్షతోనే..రాజధాని మార్పు
కేవలం తేదేపాపై ఉన్న కక్షతోనే రాజధాని మార్పు చేస్తున్నారని..కడప తెదేపా ఇన్‌ఛార్జి అమీర్ బాబు ఆరోపించారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కడప ఒకటో గాంధీ విగ్రహం ఎదుట కాగడాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.