పెరట్లో అందంగా వికసించిన పూల మొక్కలూ ప్రేమగా పెంచుకున్న కూర పాదులూ పండ్ల చెట్లనూ చూస్తూ కాసేపు కూర్చున్నా మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. అందరూ మొక్కల్ని మరీ ప్రాణంగా చూసుకోకపోవచ్చు. కానీ రోజంతా ఇంట్లో ఉండడం మాత్రం ఎవరికీ నచ్చదు. ఇంటి ముందు పెరడు ఉంటే ఉదయం, సాయంత్రం సమయంలో అయినా ఆరుబయట కూర్చోవాలనుకుంటారు.
ఇక, ఆ లాన్‌లోకి నడిచి వెళ్లే దార్లో స్వాగతం పలుకుతున్నట్లూ రంగు రంగుల కుషన్లు అందంగా పేర్చి ఉంటే... అక్కడ సౌకర్యంగా కూర్చునేందుకు సోఫాలూ కుర్చీలూ ఏర్పాటు చేస్తే... ఇంకా బాగుంటుంది కదా. కాకపోతే నేలమీద కుషన్లు పరిస్తే రెండు రోజులకే పాడవుతాయి. ఆరుబయట లెదర్ సోఫాలు వేసినా అంతే ఎండకు ఎండి, వానకు తడిచి పనికిరాకుండా పోతాయి.‘అలా అని మన కోరికను ఎందుకు చంపుకోవాలీ’ అనుకున్నట్లున్నారు కొందరు సృజనకారులు. చూడచక్కని కుషన్లనూ సోఫాలనూ కాంక్రీటుతోనే తయారు చెయ్యడం మొదలుపెట్టారు.
అచ్చం అలానే..
‘టఫ్ఫిట్ పిల్లో స్టెప్పింగ్ స్టోన్స్’ పేరుతో వచ్చే ఈ రాళ్లు అచ్చం కుషన్లలానే ఉంటాయి. వేరు వేరు కుషన్ ఆకారాలూ డిజైన్లలో తయారుచేసిన అచ్చుల్లో కాంక్రీటుని పోసి వీటిని తయారు చేస్తారు. మామూలుగా రాళ్లమీద రంగులు వేస్తే కొంత కాలానికే అది పోతుంది. అందుకే, ఈ కుషన్ రాళ్లను తయారుచేసేటపుడు తడి సిమెంటులోనే రంగుని కలిపేస్తారు. కాబట్టి వీటి రంగు ఎప్పటికీ అలానే ఉంటుంది.
అయితే, ఇక్కడ సృజన అంతా అచ్చంగా దిండ్లలా ఉండే అచ్చుల్ని తయారు చెయ్యడం, వాటిలో పద్ధతిగా కాంక్రీటుని పొయ్యడంలోనే ఉంది. ఇక, సోఫాలూ కుర్చీల విషయానికొస్తే వీటిని ఆయా ఆకారాల్లో కాంక్రీటుతో తయారు చేసి, ఆ పైన సహజమైన లెదర్‌లానే కనిపించేలా ఎంతో చాకచక్యంగా రంగులు వేస్తారు. అందుకే, ఇవి నిజమైన లెదర్ సోఫాల్లా పెరట్లో చూడ్డానికి విలాసంగానూ అందంగానూ కనిపిస్తాయి. పైగా ఆరుబయటే ఉన్నా అస్సలు పాడవ్వవు. ఆలోచన బాగుంది కదూ.