పెళ్లయిన వెంటనే మీరు కుటుంబ సభ్యులందరికీ దూరంగా వచ్చేశారు. పైగా కొత్త ప్రదేశం, భాష రాకపోవడం, కరోనా పరిస్థితుల వల్ల ఎవరినీ కలవలేకపోవడం వంటివాటివల్ల మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇవన్నీ మీలో ఒత్తిడిని పెంచుతున్నాయి. దీన్ని టెంపరరీ అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ అంటారు. ముందుగా మీ బాధను మీ భర్తకు అర్థమయ్యేలా చెప్పండి. దీన్నుంచి బయటపడే మార్గం గురించి ఇద్దరూ కలసి ఆలోచించండి.
కుటుంబ సభ్యులు, స్నేహితులు... ఇలా రోజుకొకరితో ఫోన్‌లో కాసేపు మాట్లాడితే ఒంటరిననే భావన పోతుంది. పెళ్లి అనేది మీ జీవితంలో వచ్చిన మధురమైన మార్ఫు దాన్ని ఆస్వాదించండి. చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగవంతుడైన భర్త, దేశ రాజధానిలో ఉంటున్నారు. ఇవన్నీ సానుకూల అంశాలే కదా. ప్రతికూల అంశాలను పక్కన పెట్టి మీకు జరిగిన మంచి గురించే ఎక్కువగా ఆలోచించండి. మీ దొరికిన ఖాళీ సమయాన్ని మీకు రాని భాష నేర్చుకునేందుకు ఉపయోగించండి.
ఇంతకు ముందు మీరు చేయలేను అనుకుని వాయిదా వేసిన పనులను ఇప్పుడు మొదలుపెట్టండి. యూట్యూబ్‌లో కొత్త వంటకాలను చూసి మీవారికి వండి పెట్టండి. వీటన్నింటి వల్ల కొత్త విషయాలెన్నో తెలుస్తాయి. మీలో నైపుణ్యం పెరుగుతుంది. ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా మలుచుకోవచ్చనే మనోధైర్యం వస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంకెందుకాలస్యం మొదలుపెట్టండి.