రాష్ట్రంలో అధిక రక్తపోటు (హైబీపీ) బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. గత అయిదేళ్లలోనే మహిళలు, పురుషుల్లో 8 శాతం చొప్పున బాధితులు పెరిగారు. 2019-20 గణాంకాల ప్రకారం.. మహిళల్లో 20 శాతం మంది, పురుషుల్లో 27 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో మధుమేహుల సంఖ్య ఒక్క శాతం తగ్గడం ఊరటనిస్తోంది. గత అయిదేళ్లలో ‘తెలంగాణ రాష్ట్ర పౌష్టిక ముఖచిత్రాన్ని’ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ (Ministry Of health and Family Welfare) శుక్రవారం విడుదల (National Family Health Survey 2019-20) చేసింది.
- 15-49 ఏళ్ల మధ్య వయస్కులైన అతివల్లో 6 శాతం, 15-54 ఏళ్ల మధ్య వయసు పురుషుల్లో 7 శాతం చొప్పున షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలింది.
- ఊబకాయుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమే. 2015-16, 2019-20 మధ్యకాలంలో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 2 శాతం, 15-49 ఏళ్ల మధ్య వయస్కుల్లో మహిళల్లో 1 శాతం, 15-54 ఏళ్ల మధ్య వయసు పురుషుల్లో ఏకంగా 8 శాతం మంది ఊబకాయులు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
- రక్తహీనతతో బాధపడేవారిలో అయిదేళ్లలోపు చిన్నారులు 9 శాతం మంది పెరగగా.. 15-49 ఏళ్ల సాధారణ మహిళల్లో 1 శాతం, గర్భిణుల్లో 5 శాతం మంది పెరగడం గమనార్హం.
వేధిస్తున్న వ్యాధులు
- మహిళల్లో 15-49, పురుషుల్లో 15-54 మధ్య వయస్కుల్లో అధిక రక్తపోటు బాధితులు 8% చొప్పున పెరిగారు. మహిళలు హైదరాబాద్‌లో 4.4 శాతం మంది, పురుషులు 7.7% మంది పెరగడం గమనార్హం.
- హైబీపీ బాధిత మహిళలు అధికంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి (3,67,000), హైదరాబాద్ (2,36,000). పురుషులు ఎక్కువగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి (5,46,000), హైదరాబాద్ (4,28,000).
- స్థూలకాయులు మహిళల్లో స్వల్పంగా ఒక శాతం పెరగగా.. పురుషుల్లో 8%పెరిగారు.
- అయిదేళ్లలోపు చిన్నారుల్లో అధికబరువు బాధితులు హైదరాబాద్‌లో 1.7 శాతం పెరగగా.. 15-49 ఏళ్ల మహిళల్లో 2.2 శాతం మంది పెరిగారు.
- మధుమేహ బాధితులు హైదరాబాద్‌లో 15-49 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళల్లో 4.3 శాతం మంది తగ్గగా.. 15-54 మధ్య వయసు పురుషుల్లో 3.9 శాతం మంది తగ్గారు.
- మధుమేహ మహిళలు అధికంగా ఉన్న జిల్లాలు రంగారెడ్డి (84,000), కరీంనగర్ (70,000). పురుషుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు రంగారెడ్డిలో 1,12,000, హైదరాబాద్‌లో 86,000 మంది నమోదయ్యారు.
అయిదేళ్లలోపు చిన్నారుల్లో..
- రాష్ట్రంలో 8,82,645 మంది చిన్నారులు ఎదుగుదల లోపంతో బాధపడుతుండగా.. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 1,73,073 మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ (1,55,653), హైదరాబాద్ (1,02,126), ఆదిలాబాద్ (98,116), మెదక్ (94,749) జిల్లాలు తర్వాతి 4 స్థానాల్లో నిలిచాయి.
- రాష్ట్రంలో 16,34,760 మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతుండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,11,768 మంది, మహబూబ్‌నగర్‌లో 2,71,114, హైదరాబాద్‌లో 1,91,931, నల్గొండలో 1,74,275, మెదక్‌లో 1,63,680 మంది ఉన్నారు.
- బరువు తక్కువగా ఉన్న చిన్నారులు మొత్తం 8,06,558 మంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 1,35,070 మంది, మహబూబ్‌నగర్‌లో 1,20,576, ఆదిలాబాద్‌లో 1,11,642, మెదక్‌లో 1,09,326, నిజామాబాద్‌లో 76,910 మంది నమోదయ్యారు.
15-49 ఏళ్ల మధ్యవయస్కుల్లో..
- బరువు తక్కువగా ఉన్నవారు 17,76,043 మంది. తొలి అయిదు స్థానాల్లో మహబూబ్‌నగర్ జిల్లా (2,76,716), రంగారెడ్డి (2,40,986), కరీంనగర్ (2,34,382), మెదక్ (2,25,217), ఆదిలాబాద్ (2,16,810) ఉన్నాయి.
- ఈ వయస్కుల్లో రక్తహీనతతో బాధపడుతున్న సాధారణ మహిళలు 53,53,541 మంది. అత్యధికులు నమోదైన తొలి అయిదు జిల్లాల జాబితాలో రంగారెడ్డి (8,66,903), కరీంనగర్ (6,95,183), హైదరాబాద్ (6,37,565), మహబూబ్‌నగర్ (6,35,293), నల్గొండ (5,56,813) ఉన్నాయి.
- ఇదే వయసులో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు రాష్ట్రం మొత్తమ్మీద 97,473 మంది నమోదయ్యారు. అధికంగా బాధితులున్న జిల్లాల్లో రంగారెడ్డి (25,555), నల్గొండ (15,231), ఖమ్మం (13,922), మహబూబ్‌నగర్ (12,757), నిజామాబాద్ (11,374) ఉన్నాయి.
ఇదీ చూడండి: భారత్‌ను వణికిస్తున్న అధిక రక్తపోటు
అధిక రక్తపోటు ఉందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!