అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లిలో భూవివాదం ఇద్దరిని తీవ్రంగా గాయాలపాలు చేసింది. మల్లేష్‌కు 1.75 సెంట్ల భూమి ఉంది. టమాట సాగు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో రాత్రి పూట... దాయాది బోయ హనుమంత రాయుడు.. తన టమాట పంటపైన విషపూరిత రసాయనాలు పిచికారి చేసినట్లు మల్లేష్‌కు అనుమానం వచ్చింది.
కళ్లలో కారం చల్లి..
ఈ క్రమంలో హనుమంత రాయుడ్ని అడిగేందుకు మల్లేష్ అతని పినతండ్రి కుమారుడు ఓబులేష్ తో కలిసి వెళ్లాడు. ఇద్దరితో వాగ్వాదానికి దిగిన హనుమంత రాయుడు... వారి కళ్లలో కారం చల్లి వేట కొడవలితో దాడి చేశాడు. మల్లేష్, ఓబులేష్ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం తరలింపు..
గమనించిన బంధువులు బాధితులను హుటాహుటిన కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.