అత్యంత వేగంగా అంటుకొనే ఇంధనం పెట్రోల్.. శరీరంపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తులు నిప్పంటించుకున్నా.. ఎవరైనా పోసి నిప్పంటించినా.. మరణశాసనమే.. క్షణాల్లో సజీవ దహనమవుతారు. ఎవరైనా కాపాడాలనుకున్నా రెండు నిమిషాల్లోనే జరిగిపోవాలి. మూడో నిమిషం దాటితే మంటలంటుకున్నవారు ప్రాణాలతో దక్కరని పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. ఇలాగే తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ పుట్టా విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. మంట, అత్యధిక ఉష్ణోగ్రత, గదిలో కానీ ఆరుబయట కానీ ప్రాణవాయువు (ఆక్సిజన్) మోతాదు కారణంగా ఈ ప్రక్రియ మరింత వేగంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంపై పెట్రోల్ మంట మొదలైన 30 సెకన్లలోపే దాని తీవ్రత రెట్టింపవుతుందని, మరింత వేగంగా విస్తరిస్తుందని వివరించారు.
శ్వాసక్రియకు తీవ్ర ఇబ్బంది.. అపస్మారక స్థితి...
శరీరంపై పడిన పెట్రోల్‌కు నిప్పు తగలగానే.. ఒక్కసారిగా మండి గాలిలోని ప్రాణవాయువు మంటలను వేగంగా వ్యాప్తి చెందిస్తుంది. మంట మండుతూనే సమాంతరంగా విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది.
కార్బన్‌మోనాక్సైడ్‌ను 30 సెకన్లు పీలిస్తే శ్వాసక్రియకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. మరో 30 నుంచి 50 సెకన్లలో అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ప్రాణాలను రక్షించుకొనేందుకు చేసే ప్రయత్నాలు విఫలమై ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని కాపాడాలంటే సమీపంలో ఉన్న దుస్తులు, దుప్పట్లను శరీరంపై కప్పాలి.
తీవ్రత తీరు ఇలా..
ప్రమాదవశాత్తూ పెట్రోల్ శరీరంపై పడి కాలినా, కావాలని ఎవరైనా పోసి కాల్చినా.. అది తక్కువ మోతాదులో ఉంటేనే బతికే అవకాశాలుంటాయి. వైద్య పరిభాషలో ఈ అంశాలను ఈ విధంగా వివరిస్తున్నారు నిపుణులు.
- డెర్మిస్: ఈ పరిస్థితిలో శరీరంపై ఉన్న చర్మం మాత్రమే దెబ్బతింటుంది. కొద్దిగా శరీరంపై పెట్రోల్ పడిన సందర్భంలో ఈ పరిస్థితి ఉంటుంది. కాలిన చర్మాన్ని పూర్తిగా తొలగించి గ్రాఫ్టింగ్ ప్రక్రియ ద్యారా వేరే చర్మాన్ని పెట్టి దాదాపు పూర్వ రూపాన్ని తీసుకురావచ్చు.
- ఎపిడెర్మిస్: శరీరంపై కొద్దిగా ఎక్కువ పెట్రోల్ పడిన సందర్భంలో ఈ పరిస్థితి ఉంటుంది. ఈ స్థితిలో చాలా వరకూ శరీరం, కొన్ని అవయవాలు దెబ్బతినే అవకాశాలున్నాయి.
- ఫ్యాట్ బర్నింగ్: సజీవ దహనమైన వారిలో ఇది కనిపిస్తుంది. పై చర్మం, దాని కింద ఉన్న చర్మంతో పాటు కొవ్వునూ మంట కాల్చేస్తుంది. ఫలితంగా రక్తనాళాలు, సున్నితమైన అవయవాలు పూర్తిగా దెబ్బతింటాయి. పెట్రోల్ శరీరంపై ఎక్కువ మోతాదులో పడి కాలిన సందర్భంలో ఈ పరిస్థితి ఉంటుంది.
పెరుగుతున్న ఘటనలు
రెండు, మూడేళ్ల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ ఠాణా పరిధిలో ఓ గృహిణిని కొన్ని నెలల క్రితం ఆమె భర్త, స్నేహితుడు డబ్బు కోసం చంపేసి తర్వాత ఆమె శరీరంపై నువ్వుల నూనె పోసి నిప్పంటించారు.
ఇదీ చూడండి: