తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో అటవీశాఖ సిబ్బందిపై తెరాస నేతలు కర్రలతో దాడి చేశారు. అటవీశాఖ అధికారిణిపై కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ... కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. హరితహారంలో భాగంగా ఎఫ్‌ఆర్వో అనిత ఆధ్వర్యంలో అటవీ భూములు దున్నటానికి అధికారులు వచ్చారు. అటవీశాఖ అధికారులను అడ్డుకుని తెరాస నేతలు కర్రలతో దాడికి దిగారు. ఎఫ్‌ఆర్వో అనితకు గాయాలయ్యాయి. బాధలు తట్టుకోలేక.. ఆమె తీవ్రంగా విలపించారు.
దాడి చేసింది కోనేరు కృష్ణారావు: డీఎఫ్‌వో రాజారమణరెడ్డి
అటవీశాఖ అధికారిణి చోలే అనితపై కోనేరు కృష్ణారావు చేశారని డీఎఫ్‌వో రాజారమణరెడ్డి తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోలే అనితకు తీవ్రగాయాలయ్యాయన్నారు.
కోనేరు కృష్ణారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
అటవీశాఖ అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో కోనేరు కృష్ణారావు, అతని అనుచరుడు బూర పోషంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఇద్దరిపై ప్రభుత్వ విధులకు ఆటంకం కింద కేసు నమోదైంది.