పిల్లి కరిచిన ఇద్దరు మహిళలు.. రెండు నెలల అనంతరం ఒకే రోజున మరణించారు. ఈ దుర్ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడ దళితవాడలోని కమలను, నాగమణిని రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు వారిద్దరు టీటీ ఇంజక్షన్లు చేయించుకొని గాయాలు తగ్గడానికి మందులు వాడటంతో కొద్ది రోజులకు ఉపశమనం కలిగింది.
నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో, నాగమణి.. శుక్రవారం(మార్చి 4న) విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా.. కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు మరణించింది. పిల్లి కరవడంతో ఇద్దరికీ ర్యాబిస్ సోకిందని వైద్యులు చెప్పారని స్థానికులు తెలిపారు.
ఇద్దరు మహిళల మృతికి కారణమైన పిల్లి.. కుక్కకాటుకు గురై మరణించిందని స్థానికులు వెల్లడించారు. పిల్లి, కుక్క, ఎలుక, పాము తదితరాలు కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని స్థానిక ఆరోగ్య కేంద్రం అధికారి శొంఠి శివరామకృష్ణారావు సూచించారు.
ఇదీ చూడండి: కర్నూలు జిల్లాలో జింకల కళేబరాలు కలకలం