తెలంగాణ వవరంగల్ రూరల్ జిల్లా నీరుకుల్లా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గార్డెన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ భారతమ్మ అనే వ్యవసాయ కూలీ మృతి చెందింది.
వరంగల్ రూరల్ జిల్లా నీరుకుల్లా కటాక్షపూర్ వద్ద ఓ ఆటోను తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన 20 మంది మహిళలు.. మిరప తోటల్లో పని చేయడానికి నల్లబెల్లి మండలం రంగాపురానికి ఆటోలో వెళ్తున్నారు. నీరుకుల్లా కటాక్షపుర్ మూలమలుపు వద్ద వేగంగా వచ్చిన తుఫాను వాహనం... వీరి ఆటోను ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆటో బోల్తాపడి పూర్తిగా నుజ్జునుజ్జయింది. అందులోని పలువురు మహిళలు ఎగిరిపడి రోడ్డుమీద పడ్డారు. ఘటన స్థలంలో తెగిపడిన ఓ మృతురాలి కాలు.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన 9 మంది క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. భారతమ్మ అనే మహిళ ఆసుపత్రిలో మృతి చెందింది.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులు సాంబక్క(60) సరోజన(55), ఎండీ బీబీ (55), భారతమ్మగా గుర్తించారు.
మంత్రి సంతాపం..
ప్రమాదంపై రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీచూడండి: నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం