Cybercriminals new plans: ‘‘ఈ పండుగకు మేం కొత్త కారు కొనాలనుకుంటున్నాం. నాలుగేళ్ల క్రితం రూ.15లక్షలు పెట్టి తీసుకున్న కారును రూ.6లక్షలకే ఇచ్చేస్తున్నాం. మీరు ఇష్టపడితే మీ వివరాలు పంపితే చాలు. మేమే వచ్చి కారు డెలివరీ చేస్తాం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాంకు ఉద్యోగి పేరుతో ప్రకటన. ఛాటింగ్‌తోనే బేరసారాలు సాగించిన బాధితుడు.. అడ్వాన్స్‌గా రూ.50వేలు ఆన్‌లైన్ ద్వారా పంపాడు. తరువాత కొద్ది సమయానికే అతడి ఖాతాలోని రూ.7లక్షలు మాయగాళ్లు కొట్టేశారు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే..!
సంక్రాంతి పర్వదినం అవకాశంగా చేసుకున్న మాయగాళ్లు ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లను వేదికగా చేసుకుని మోసాల వల విసురుతున్నారు. క్లియరెన్స్ సేల్‌లో భాగంగా రూ.10,000-25,000 ధర చీరలు, చుడీదార్లు, ఓణీల ఫొటోలను ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో ప్రదర్శించి 60శాతం రాయితీ అంటూ మోసగాళ్లు అమాయకులను ఆకట్టుకుంటున్నారు. రూ.1 చెల్లిస్తే చాలు కంచిపట్టు చీర మీ ఇంటికే పంపుతామంటున్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులు ధరించే వస్త్రాలు. ఇంట్లో ఉపయోగించే గృహోపకరణాలు. ద్విచక్ర వాహనాలు, కార్లు, సైకిళ్ల వరకూ అన్నీ పండుగ అమ్మకాలంటూ యజమానుల పేర్లు, ఫొటోలు, నకిలీ చిరునామాలను కూడా ప్రకటనల్లో ఉంచుతారు. లావాదేవీలు జరిపేందుకు ఛాటింగ్, వాట్సాప్ నంబర్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు.
రూపాయే కదా అని చెల్లిస్తే..
సైబర్ నేరస్థులు 360 డిగ్రీల కోణంలో సొమ్ము కాజేస్తున్నారని రాచకొండ సైబర్‌క్రైమ్ ఏసీపీ హరినాథ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే లావాదేవీల్లో కొనుగోలుదారులు చూసిన వస్తువుకు బదులుగా మరొకటి పంపుతారు. వారి నుంచి ఫిర్యాదు రాగానే వస్తువు పంపితే నగదు ఖాతాలో జమ చేస్తామంటారు. ముందుగా రూ.1-2 చెల్లించమంటారు. లావాదేవీ ప్రారంభం కాగానే పిన్, ఓటీపీ నెంబర్లు తీసుకుని ఖాతాలో సొమ్మంతా లాగేస్తారు. మరో తరహాలో ఫోన్, ఈ-మెయిల్స్‌కు ఫిషింగ్ సందేశాలు పంపుతారు. లింక్ క్లిక్ చేయగానే ఎనీడెస్క్, టీమ్ వ్యూయర్ ద్వారా అవతలి వారి బ్యాంకు ఖాతా వివరాలు గుర్తించి డబ్బు కాజేస్తుంటారు. సామాజిక మాధ్యమాల ప్రకటనల్లో కనిపించే ఫొటోలను గుడ్డిగా అనుసరించవద్దు. లింక్‌లను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడవద్దని హెచ్చరిస్తున్నారు.
బూస్టర్ డోస్ లింకులు.. జర భద్రం
ఒమిక్రాన్ ఉద్ధృతితో కరోనా టీకా బూస్టర్ డోస్‌కు డిమాండ్ పెరిగింది. సైబర్ నేరస్థులు దీన్ని కూడా అనువుగా మలచుకున్నారు. బూస్టర్ డోసు తీసుకోవాలనుకుంటున్నారా! అని అడిగి అవతలి వైపు నుంచి ఔను అనే సమాధానం రాగానే వారి ఫోన్ నంబర్లకు లింకు పంపుతున్నారు. దాన్ని క్లిక్ చేసిన తరువాత వచ్చే ఓటీపీలను సేకరించి ఖాతాలో సొమ్ము లాగేసుకుంటున్నారు. బూస్టర్ డోసు పేరుతో వచ్చే ఫోన్లు, సందేశాల్లో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ సూచించారు.
- ఇదీ చూడండి: కేకులందు.. విశాఖ సిస్టర్స్ కేకులు వేరయా!