suicide: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగికి చెందిన తెలుగుదేశం కార్యకర్త కోన వెంకటరావు ఆత్మహత్య రాజకీయంగా కలకలం సృష్టించింది. అధికార పార్టీ నేతలను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ వెంకటరావుపై కేసు నమోదైంది. దీనిపై విచారణ కోసం సోమవారం మధ్యాహ్నం ఇద్దరు కానిస్టేబుళ్లు వెంకటరావు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వెంకటరావు ఇచ్ఛాపురంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన భార్య కృష్ణకుమారి తెలిపారు. గంటలో తమ ముందు హాజరు కావాలని ఒత్తిడి చేశారని వాపోయారు. కొన్ని గంటల తర్వాత ఇఛ్చాపురం నుంచి పొత్తంగికి వచ్చిన వెంకటరావు.. పోలీసులు, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తారోనని భయపడినట్లు ఆమె తెలిపారు. అనంతరం పొలం దగ్గరికి వెళ్లి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు.
పోస్టుమార్టం కోసం వెంకటరావు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారి కుటుంబ సభ్యులను నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌ఛార్జి గౌతు శిరీష, శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు కూన రవికుమార్, ఇతర నాయకులు పరామర్శించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు వేధించడం వల్లే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వెంకటరావు చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోన వెంకటరావును వేధించిన టెక్కలి, మందస ఎస్సైలతోపాటు బాధితుడి ఇంటికి వచ్చిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ.. ఎస్పీ అమిత్ బర్దార్‌కు తెలుగుదేశం నేతలు గౌతు శిరీష, కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు.
తెదేపా కార్యకర్త కోన వెంకటరావు ఆత్మహత్య పై.. ఎస్పీ అమిత్ బర్దార్ వివరణ ఇచ్చారు. కోన వెంకటరావుని పోలీసులు వేధించారని అని చెప్పడం పూర్తిగా అబద్దమన్నారు. పూర్తి విచారణ జరిపి తదుపరి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టింది వెంకటరావు అవునా, కాదా అని తెలుసుకునేందుకే పోలీసులు వెళ్లారని వెల్లడించారు
ఇదీ చదవండి: ఆ కారణంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో సీఎం జగన్: చంద్రబాబు