Suicides In Ap: రాష్ట్రంలో ఆత్మహత్యలు భారీగా పెరిగాయి. అర్ధంతరంగా తనువు చాలిస్తున్నవారిలో నిరుద్యోగులు, కూలీలు, విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. 2020తో పోలిస్తే 2021లో నిరుద్యోగుల బలవన్మరణాలు 14.24%, రోజు కూలీల ఆత్మహత్యలు 20.51%, విద్యార్థుల బలవంతపు చావులు 11.51% మేర పెరిగాయి. 2020లో రాష్ట్రంలో మొత్తం 7,043 ఆత్మహత్యలు చోటుచేసుకోగా.. 2021లో 14.5% పెరిగి ఆత్మహత్యల సంఖ్య 8,067కు చేరింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే గతేడాది బలవన్మరణాల పెరుగుదల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన ‘వార్షిక నివేదిక-2021’ ఈ విషయాల్ని వెల్లడించింది. అందులోని ప్రధానాంశాలివి.
ఇవీ ప్రధాన కారణాలు
* గతేడాది రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ వారిలో 5,529 మంది (68.53%) అనారోగ్యం, కుటుంబ సమస్యలు, అప్పుల్లో కూరుకుపోవటం వల్ల ప్రాణాలు తీసుకున్నారు.
* వీరిలో 5,269 మంది (65.30%) రోజు కూలీలు కాగా ఆ తర్వాత స్వయం ఉపాధిపై ఆధారపడి జీవించేవారు, రైతులు, రైతు కూలీలు ఎక్కువ ఉన్నారు.
* రూ.లక్ష కంటే తక్కువ వార్షికాదాయం కలిగిన వారే ఎక్కువగా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 4,173 మంది (51.72%) వీరే.
* ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 80% మంది పురుషులు, 20% మంది మహిళలు.
* ప్రేమ విఫలమైందని, పెళ్లి కుదరలేదని 212 మంది ప్రాణాలు తీసుకున్నారు. వీరిలోనూ ఎక్కువ మంది పురుషులే.
* ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో 16.90% మంది నిరక్షరాస్యులు. 59.67% మంది 1-10 తరగతి లోపు చదువుకున్న వారే.
సామూహిక ఆత్మహత్యల్లో మూడో స్థానం
* సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. గతేడాది మొత్తం ఇలాంటి 22 ఘటనల్లో 56 మంది చనిపోయారు. తొలి రెండు స్థానాల్లో ఉన్న తమిళనాడు, రాజస్థాన్‌ల్లో వరుసగా 33, 25 కేసులు నమోదయ్యాయి.
* గతేడాది దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడగా అందులో 4.9% మంది మన రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు.
ఇవీ చదవండి: