తూర్పుగోదావరి జిల్లాలో లీటరు పెట్రోలు (Petrol)ధర రూ.111.68 ఉంటే.. డీజిల్ ధర రూ.104.08కి చేరింది. అసలుకు కొసరు అన్నట్లు.. నానాటికీ పెరుగుతున్న ధరలకు తోడు మోసాలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. ఐదు లీటర్ల పెట్రోలు కొలిస్తే 25 మిల్లీలీటర్లకు మించి తరుగు ఉండకూడదనేది నిబంధన. కానీ కొన్నిచోట్ల 40- 50 మిల్లీ లీటర్లకు మించి తేడాలొస్తున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరుకు 385 బంకులు తనిఖీ చేశారు. అతిక్రమణలపై ఎనిమిది కేసులు నమోదుచేసి రూ.40 వేలు అపరాధ రుసుము విధించారు. జిల్లాలో 12 పెట్రోలియమ్ రిఫైనరీలు, నిల్వ, టెర్మినల్స్ అండ్ కేలిబ్రేషన్ సెంటర్లనూ ఈ ఏడాది 20 సార్లు తనిఖీ చేసి రూ.25 వేలు అపరాధ రుసుము విధించారు.
డిజిటల్ దోపిడీ..
తూకాల్లో మోసాల్లో సింహభాగం డిజిటల్ కాటాలదే. తూకాల్లో మోసాల నియంత్రణకు అంకెల రూపంలో దర్శనమిచ్చే (డిజిటల్ డిస్‌ప్లే) కాటాలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో స్పెషల్, హై, మీడియం, ఆర్డినరీ ఆక్యురసీ పేరుతో నాలుగు రకాలు ఉన్నాయి.
మోసం ఇలా..:
కాటాలను దాని సామర్థ్యానికి తగినట్లు సిద్ధంచేస్తారు. 10 కేజీల పరీక్ష సామర్థ్యంతో సిద్ధం చేస్తే.. ఆ ఎలక్ట్రానిక్ కాటా డిస్‌ప్లేలో 10.000 కిలోగ్రాములుగా చూపిస్తుంది. 10 కి.గ్రా. టెస్ట్ వెయిట్‌ను ఆ ఎలక్ట్రానిక్ కాటాపై ఉంచి.. పది కిలోగ్రాముల కంటే తక్కువో, ఎక్కువో చూపించేలా కొందరు మార్చేస్తున్నారు. ఈ రెండు సoదర్భాల్లో కాటా సాధారణ స్థితిలో సున్నాగా చూపిస్తున్నా.. వినియోగదారులు మాత్రం నష్టపోతున్నారు. కాటాలో వేయింగ్ మోడ్‌తోపాటు లైట్ మోడ్ సదుపాయం/ఎంపికకు ఉన్న సదుపాయాన్ని అవకాశంగా మలచుకుని బరువు ఎక్కువ/తక్కువగా చూపించేలా లైట్ మోడ్ కింద మార్చి మోసం చేస్తున్నారు. అధికారులు వేసిన సీళ్లు దొడ్డిదారిన తెరిచి ఈ తరహా అక్రమాలకు పాల్పడటం పరిశీలనాంశం. డిజిటల్ కాటా లోపలి భాగంలో ఐసీ (ఇంటిగ్రేటెట్ చిప్) అమర్చి.. రిమోట్ కంట్రోల్ ద్వారా తూకం రీడింగ్ ఎక్కువగా చూపించేలా చేస్తున్నారు.
లోగుట్టు వారికే ఎరుక..
జిల్లాలో వ్యాపార విభాగాలు (ట్రేడ్స్) 50 ఉంటే.. వీటి పరిధిలో వివిధ రకాల వ్యాపార సంస్థలు 36,319 ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు తనిఖీలు- పరిశీలన పేరుతో 24,107 సంస్థలపై తూ.కొ. శాఖ ఆరాతీసింది. మోసాలు, నిబంధనల అతిక్రమణలపై ఇప్పటికి 668 కేసులు నమోదుచేసి.. రూ.40.01 లక్షల అపరాధ రుసుం విధించారు.
పంపుల్లో ‘చిప్’ట్రిక్స్...
తూకాల్లో మోసాలకు కొందరు చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మదర్‌బోర్డుకు సిగ్నల్ తప్పుగా వెళ్లేలా మైక్రోచిప్స్ అమరుస్తున్నారు. రిమోట్‌తో సాగే ఈ అక్రమాల్లో తనిఖీల సమయంలో జాగ్రత్త పడుతున్నారు.
మోసం ఇలా..: భూమిలో నిల్వ ఉంచిన డీజిల్/ పెట్రోలు పంపు ద్వారా పైకి వస్తుంది.. లీటరు లేదా రూ.100 కావాలంటే కీ ప్యాడ్‌లో ఎంటర్ చేస్తారు. సిగ్నల్ మదర్‌బోర్డుకు అందుతుంది. అక్కడకు వెళ్లి అందిన తర్వాత మదర్ బోర్డు నుంచి మీటరింగ్ యూనిట్‌కు అందుతుంది. దీంతో నిర్దేశిత మొత్తంలో నిల్వలు వచ్చి ఆగిపోతాయి. ఈ క్రమంలో మదర్‌బోర్డుకు సిగ్నల్ తప్పుగా వెళ్లేలా చిప్స్ వాడటంతో రూ.100కి.. రూ.90 పెట్రోలే వెళ్లేలా తప్పుడు సంకేతాలు వస్తాయి. రీడింగులో సరిగ్గానే చూపడంతో మోసాన్ని పసిగట్టలేని పరిస్థితి. పెట్రోలు బంకుల్లో మైక్రోచిప్‌లు, పోటెడ్ పల్సర్లు అమర్చే వ్యవహారం తెరమీదకు వచ్చింది.
విస్తృత తనిఖీలతో మోసాలకు అడ్డుకట్ట
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పెట్రోలు పంపుల మదర్ బోర్డుల వద్ద చిప్స్ పెట్టే అవకాశం లేకుండా సీళ్లు వేసి అప్‌గ్రేడ్ చేశాం. అలా చేసినా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పెట్రోలు బంకుల్లో డిస్పెన్సింగ్ పంపుల్లో మైక్రో చిప్స్, పోటెడ్ పల్సర్స్ అమర్చే ముఠా వ్యవహారంపై తెలంగాణ నుంచి మా శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందింది.= దీంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాలో అన్ని బంకులు తనిఖీ చేసి తాజా పరిస్థితి తెలుసుకుంటాం. -ఎం.మాధురి, డిప్యూటీ కంట్రోలర్, తూనికలు- కొలతలశాఖ
ఇదీ చదవండి: