Gun firing on Realtors: స్థిరాస్తి వ్యాపారంలో గొడవలు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీశాయి. ఏకంగా తుపాకులతోనే కాల్చుకునే పరిస్థితికి తీసుకొచ్చాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరశివారులో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనాన్ని స్థానికులు గమనించారు. కారుపై రక్తపు మరకలు ఉండటం.. వాహనంలో ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మరో వ్యక్తి శ్రీనివాస్‌రెడ్డి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని రాఘవేందర్ రెడ్డిగా గుర్తించారు. హైదరాబాద్ బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాఘవేందర్ మృతి చెందారు. అతని ఛాతీ కింద బుల్లెట్ గాయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వ్యాపారంలో వివాదాలే కారణమా
Realtors Murder at Ibrahimpatnam : "పటేల్‌గూడలో ఏడాది క్రితం 22 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి వెంచర్ వేశారు. కాగా శ్రీనివాస్‌రెడ్డి వెంచర్ పక్కనే మట్టారెడ్డికి చెందిన భూమి ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య 6 నెలలుగా భూ వివాదం జరుగుతోంది. మట్టారెడ్డి మాట్లాడుకుందామని పిలవడంతోనే శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి వెంచర్ వద్దకు తెల్లవారుజామున వెళ్లారు. అక్కడే కొందరు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. దీని వెనక ఉంది మట్టారెడ్డేనని మా అనుమానం."
- మృతుల కుటుంబీకులు
వెంబడించి కాల్చారు..
"కర్ణంగూడలోని వెంచర్ వద్దకు వెళ్లిన రియల్టర్లు శ్రీను, రాఘవేందర్‌రెడ్డిలపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన చూసి రాఘవేందర్‌రెడ్డి భయంతో కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. దుండగులు అతణ్ని వెంబడించారు. వెంబడిస్తూ.. అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాఘవేందర్రెడ్డిని అక్కడ ఉన్న వాళ్లు గమనించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు."
- ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వెల్లడించిన పోలీసులు
అదుపులో అనుమానితుడు
కాల్పుల ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పరిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు.. అనుమానుతులను ప్రశ్నిస్తున్నారు. కుటుంబసభ్యుల అనుమానం మేరకు వ్యాపార భాగస్వామి అయిన మట్టారెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిపై గతంలో కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదీ చదవండి:
Mother suicide with children : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య