తెలుగు అకాడమీ నిధుల స్వాహా (TELUGU ACADEMY SCAM)వ్యవహారం బయట వ్యక్తులు కేంద్రంగా నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను సీసీఎస్ పోలీసులు సేకరించారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లోని 60 కోట్ల రూపాయలు, కెనారా బ్యాంకు చందానగర్ శాఖలో రూ.11 కోట్లు విత్‌డ్రా చేసేందుకు ప్రణాళిక రచించారని దర్యాప్తులో బయటపడింది. యూబీఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావును వినియోగించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
కమీషన్ ఇస్తే నాకు ఓకే..
అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Telugu academy fd scam)స్వాహా చేసేందుకు ఏడు ఎనిమిది నెలల ముందే ప్రణాళిక సిద్ధమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంతోష్‌నగర్, కార్వాన్ బ్యాంకుల్లో ఉన్న అకాడమీ డిపాజిట్లను మరో బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదిలీ చేయాలని ఆ ముగ్గురు భావించారు. ఈ వ్యవహారాలన్నీ చూసుకోవాలని ఇందుకు ప్రతిఫలం ఇస్తామని యూబీఐ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీతో వారు మాట్లాడుకున్నట్టు విచారణలో బయటపడింది. మస్తాన్‌వలీ ఈ విషయాన్ని మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావుతో చెప్పగా, అతను తనకు పది శాతం కమీషన్ ఇస్తే సహకరిస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని నిందితులకు చెప్పగా... వారు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించారు.
ఇదీ జరిగింది..
ఫిక్స్‌డ్ డిపాజిట్లను నగదు బదిలీ చేసేందుకు మస్తాన్‌వలీ నకిలీ పత్రాలు సృష్టించి మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీకి నగదు బదిలీ చేశాడు. అక్కడి నుంచి 60 కోట్ల రూపాయలు అగ్రసేన్ బ్యాంకుకి బదిలీ అయ్యాయి. నకిలీ ఖాతాలు సృష్టించిన నిందితులు ఆ ఖాతాల్లో రూ.60 కోట్ల నగదు జమ చేయగానే ఏపీ మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు, సొసైటీ మేనేజర్‌లు పద్మావతి, మోహియుద్దీన్ అగ్రసేన్ బ్యాంకు నుంచి నిందితుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. ఆ మొత్తాన్ని దశల వారీగా నిందితులు సూచించిన ప్రాంతాలకు మోహియుద్దీన్.. కారులో వెళ్లి అందజేశాడు. తన కమీషన్ ఇవ్వాలని నిందితులను సత్యనారాయణరావు అడగ్గా.. ఒకసారి రూ. 90 లక్షలు ఇచ్చారు. మిగతా కమీషన్ తర్వాత ఇస్తామన్నారు. ఈ విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి.
కస్టడీ పిటిషన్..
ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు జైలులో ఉన్న సత్యనారాయణరావు, మోహియుద్దీన్, పద్మావతి, మస్తాన్‌వలీను పదిరోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీసీఎస్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
సుప్రీం ఆదేశాలతో..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu academy scam).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.
ఇలా వెలుగులోకి వచ్చింది..
ఈ నేపథ్యంలో .. భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయని(fixed deposits) తేలింది. గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈనెల 21న డిపాజిట్ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్ నేరుగా బ్యాంకుకు వెళ్లారు. ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు తెలిపారు.
ఇదీచూడండి:
Telugu academy scam: నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్