తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ చెందిన ప్రణాళిక, చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన మ్యాదర అనిల్(26)కు రెండు నెలల కిందట వివాహం జరిగింది. ప్రణాళిక ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో చివరి సంవత్సరం చదువుతోంది. ప్రణాళిక వివాహం జరిగినప్పటి నుంచి తనతో మాట్లాడకపోవడం, తనకన్నా ఎక్కువగా చదువుకోవడంతో అనిల్ జీర్ణించుకోలేకపోయాడు.
ఎక్కువ సమయం ఫోన్‌లో స్నేహితులు, తల్లిదండ్రులతో మాట్లాడేది. ఈ విషయంపై అనిల్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అనిల్ డిగ్రీ మధ్యలోనే వదిలేసి హుస్నాబాద్‌లో బ్యాటరీ రిపేరింగ్ దుకాణం కొనసాగిస్తున్నాడు. ఆషాఢమాసం కావడంతో ప్రణాళిక పుట్టింటికి వెళ్లింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని సర్దిచెప్పి అతను ఈ నెల 18న ఆమెను బొమ్మనపల్లికి తీసుకువచ్చాడు. ఎలాగైనా ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం వేచి చూశాడు.
ఈ నెల 23న పని నిమిత్తం హుస్నాబాద్‌లోని తన దుకాణానికి, తల్లిదండ్రులు సైతం వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. కొత్త కత్తి కొనుగోలు చేసిన అనిల్ తన స్నేహితుడి ద్విచక్రవాహనంపై మెకానిక్ దుస్తులతో బొమ్మనపల్లికి చేరుకున్నాడు. ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్న ప్రణాళిక వీపు, మెడపై కత్తితో రెండు సార్లు దాడి చేశాడు. ఇంట్లో ఉన్న గొడ్డలితో మరో మారు దాడి చేసి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు. గొడ్డలిని శుభ్రం చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి జారుకున్నాడు.
సాయంత్రం సమయంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆమె అత్తమామలు ప్రణాళిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అనిల్ ఏమీ తెలియనట్లు ఇంటికి చేరుకుని దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనిల్‌ను విచారించగా అనుమానంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి గొడ్డలి, కత్తి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
నవ వధువుకు షాక్.. తొలి రాత్రి భర్త వింత ప్రవర్తన.. ఇదేమని అడిగితే...!