ఆ యువకుడు ఆరు నెలలుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ యజమాని ఇంటి నుంచి బంగారు ఆభరణాలను దుకాణానికి తెచ్చేవాడు. రాత్రి తిరిగి యజమాని ఇంటికే తీసుకెళ్లేవాడు. ఒకసారి అనుమానమొచ్చి లెక్కల్లో ఆరా తీయగా ఏకంగా పది కిలోల తేడా వచ్చింది. యువకుడి ఆచూకీ కనిపించలేదు. మోసం జరిగిందని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన ప్రకారం.. విజయవాడలోని గవర్నర్‌పేట జైహింద్ కాంప్లెక్సులో మహవీర్ అనే వ్యాపారి రాహుల్ జ్యువెలర్స్ పేరిట బంగారు నగల వ్యాపారం చేస్తున్నారు. అదే కాంప్లెక్సులో పైఅంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆయన వద్ద కృష్ణలంక రాణిగారితోటకు చెందిన బొబ్బిలి వెంకటహర్ష(25) పని చేస్తున్నాడు. డిగ్రీ చదివిన అతను ప్రతిరోజూ యజమాని ఇంటి నుంచి నగలను దుకాణానికి తీసుకొస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నగలు తెచ్చేందుకు కాంప్లెక్సు పైకి వెళ్లాడు. తిరిగి దుకాణానికి రాలేదు. ఇంటికి వెళ్లి ఉంటాడని అనుకున్నారు. మధ్యాహ్నం నుంచి దుకాణం తెరవకున్నా వారికి అనుమానం రాలేదు. బుధవారం ఉదయమూ హర్ష రాకపోవడంతో యజమాని మహవీర్ స్వయంగా దుకాణం తెరిచారు. అనుమానం రావడంతో వెంటనే దుకాణం, ఇంట్లోని నగలను లెక్క చూశారు. భారీగా తేడా కనిపించడంతో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గవర్నర్‌పేట పోలీసులను ఆశ్రయించారు.
పక్కా ప్రణాళిక... రూ.4.5 లక్షల చెక్కు మార్పిడి
దుకాణానికి చెందిన రూ.4.5 లక్షల విలువైన చెక్కును పోరంకి సమీపంలోని బ్యాంకులో హర్ష నగదుగా మార్చుకున్నట్లు గుర్తించారు. అయితే.. నగల తస్కరణకు అతను ముందే ప్రణాళిక వేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే.. కృష్ణలంకలోని ఇంటిని పది రోజుల క్రితం ఖాళీ చేశాడు. గుంటూరు జిల్లా తాడేపల్లికి మారుతున్నట్లు ఇరుగుపొరుగు వారికి తెలిపాడు. కానీ.. పోలీసుల దర్యాప్తులో తాడేపల్లిలో లేడని గుర్తించారు. నగరంలోనే మరో ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని, ఆ వివరాలను ఎక్కడా బయట పడకుండా జాగ్రత్త పడ్డాడు. నిందితుడిని పట్టుకునేందుకు నగర సీపీ శ్రీనివాసులు సీసీఎస్ పోలీసులతో పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దుకాణంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అతని బంధువులు, స్నేహితులను గుర్తించే పనిలో ఉన్నారు.
ఇవీ చదవండి: