Mother Suicide With Sons in Boinapalli : తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఆ ముగ్గురు మృతి చెందారు.
బోయినపల్లికి చెందిన అనూషకు అదే గ్రామానికి చెందిన మహేందర్‌తో ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు గణ(3), మణి(1.5 సం.) ఉన్నారు. మహేందర్ ఉపాధి కోసం ఎనిమిది నెలల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. అప్పట్నుంచి అనూష తన అత్తామామలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే వారితో ఆమెకు తరచూ గొడవలు జరిగేవి.
బుధవారం రాత్రి కూడా అనూషకు తన కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన ఆమె తన ఇద్దరు కుమారులను తీసుకుని పొలాల వైపు వెళ్లింది. తను లేకుండా తన కుమారులు ఎలా బతుకుతారని భావించి వారిని తీసుకుని.. వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం అటుగా వెళ్లిన రైతులు బావిలో మృతదేహాలు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.