విశాఖలో సంచలనం రేపిన పసిపిల్లల విక్రయాల కేసులో పోలీసులు మరింత మందిని విచారించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉండగా... ఆసుపత్రికి సంబంధించిన వారితో పాటు ఇతరులను సైతం ప్రశ్నించనున్నారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో యూనివర్సల్ సృష్టి ఆసుపత్రి సిబ్బంది మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ.. అక్కడి గర్భిణులకు గాలం వేసేవారు. ఈ క్రమంలో మెడికల్ క్యాంపులు నిర్వహించిన ప్రాంతాల వివరాలను తీసుకుని.. అక్కడి ప్రజల నుంచి పోలీసులు సమాచారాన్ని రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రాథమిక విచారణలో ఆరుగురు పిల్లలను సృష్టి ఆసుపత్రి కేంద్రంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ దిశగా గుట్టు రట్టు చేసేందుకు వివిధ అంశాల్ని లోతుగా పరిశీలిస్తున్నారు. సృష్టి ఆసుపత్రిలో ఇటీవలి కాలంలో జరిగిన ప్రసవాలు, ఆసుపత్రి నుంచి జీవీఎంసీ జనన నమోదు కోసం అందించిన వివరాలు వంటి వాటిని పోలీసులు సేకరించనున్నారు. ఆయా అంశాలను అక్కడి సీసీ కెమెరాల ద్వారా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా బేరీజు వేయనున్నారు. పసి పిల్లలను అక్రమంగా తరలించడం పోలీసు వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఇదే తరహాలో మరో కేసు సైతం సృష్టి ఆసుపత్రిపై నమోదై ఉంది. వీటన్నింటి ఆధారంగా ఈ కేసును చాలా ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నారు.