భారీ విధ్వంసాలు సృష్టించడానికి అవకాశమున్న అత్యంత ప్రమాదకరమైన 'అమ్మోనియం నైట్రేట్' నిల్వపై విశాఖ యంత్రాంగం దృష్టి సారించింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిగిన ప్రమాదానికి అమ్మోనియం నైట్రేట్ కారణమని తెలియటంతో విశాఖ నౌకాశ్రయం వద్ద ఉన్న నిల్వలను అధికారులు శుక్రవారం పరిశీలించారు. కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు మిందిలో శ్రావణ్ షిప్పింగ్ సంస్థ గిడ్డంగిని ఆర్‌డీవో కిశోర్, పీసీబీ ఈఈ సుభాన్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శంకర్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ముప్పు లేదు..
'విశాఖలో 18,500 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంది. విశాఖ నౌకాశ్రయంలో భద్రతా ప్రమాణాలు అత్యుత్తమంగా ఉన్నాయన్న కారణంతో విదేశాల నుంచి భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను విశాఖలోనే దిగుమతి చేస్తున్నారు. దిగుమతి చేసుకున్నాక గిడ్డంగిలో ఉంచి ఆయా ఏజెన్సీలకు సరఫరా చేసుకుంటున్నారు. ప్రసుత్తం అలాంటి ఏజెన్సీలు మన రాష్ట్రంలో లేవు. ఇతర రాష్ట్రాల వాళ్లు నేరుగా విదేశాలకు ఆర్డర్ చేసి దీనిని ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నారు. విశాఖ నుంచి నెలలోగా అమ్మోనియం నైట్రేట్ తీసుకెళ్లాలని వారిని ఆదేశించాం. 270 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటాకే ఈ లవణం మండుతుంది' అని అధికారులు వెల్లడించారు. విశాఖకు అమ్మోనియం నైట్రేట్ ముప్పు లేదని ఆ బృందం తేల్చింది. అయితే ముందు జాగ్రత్తగా మరింత లోతుగా పరిశీలించాలని అగ్నిమాపక సిబ్బందికి సూచించింది.
ఇదీ చదవండి