తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిశారు. వాసుపల్లి గణేష్ కుమార్ ఇద్దరు కుమారులను సీఎం జగన్ వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన కుమారులు వైకాపాలో చేరటం సంతోషం కలిగిస్తోందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఏపీని ముందుకు తీసుకువెళ్లటంలో సీఎం జగన్ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. వైకాపా తీసుకువచ్చిన పథకాలు అట్టడుగు వర్గాలను ప్రభావితం చేస్తున్నాయన్న ఆయన...ప్రజాహిత పాలన చూసే తన కుమారులు వైకాపాలో చేరారని స్పష్టం చేశారు. వచ్చే విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించేలా కృషి చేస్తానని వాసుపల్లి స్పష్టం చేశారు.
మరిన్ని చేరికలు
రాష్ట్రంలోని పేద వర్గాలకు న్యాయం చేయడంలో సీఎం జగన్ చేస్తున్న కృషిని చూసి ఆయనకు మద్దతు తెలుపుతున్నామని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. వైకాపా పార్టీలోకి వచ్చినందుకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు వంశీ స్వాగతం తెలిపారు. వాసుపల్లి గణేష్ వైకాపాలోకి రావడం మంచి పరిణామమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజాసేవకులు వైకాపాలోకి వస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు.
ఇదీ చదవండి : సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జాతీయ కార్యదర్శి చందన్న అరెస్టు