సింహాచలం పంచగ్రామాల్లో 12 వేల మందికిపైగా ఆక్రమణదారులు ఉన్నారని, ఆ స్థలాల్ని క్రమబద్ధీకరించడం ద్వారా దేవస్థానానికి రూ.500 కోట్ల ఆదాయం సమకూరుతుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. క్రమబద్ధీకరణ వల్ల దేవస్థానం కోల్పోతున్న భూమికి పరిహారంగా అంతే భూమిని ప్రభుత్వం కేటాయించాలని.. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి ఏర్పాటైన రాష్ట్రస్థాయి కమిటీ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం మంత్రులు ముత్తంశెట్టి, వెలంపల్లి వివరాల్ని వెల్లడించారు.
ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘సమస్య న్యాయస్థానంలో ఉన్నందున అటు దేవస్థానం ఇటు స్థానికులకు ఇబ్బంది లేని పరిష్కారంపై చర్చించాం. స్థానికులకు ప్రభుత్వం ఏమేర న్యాయం చేయవచ్చనే దానిపై నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే శుభవార్త వెలువడుతుంది. మేమే న్యాయస్థానంలో కేసు వేయించి సమస్య పరిష్కారంలో తాత్సారం చేస్తున్నామంటూ తెదేపా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. రెండు దశాబ్దాలకుపైగా పెండింగులో ఉన్న సమస్య ఇది. చాన్నాళ్ల కిందటే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ కమిటీని వేసి సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు కానీ చేయలేదు. ఎన్నికల ముందు ఓ జీవోనూ తీసుకువచ్చారు కానీ, అమలు చేయలేదు’ అని తెలిపారు.
వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... ‘సింహాచలం భూములను సింహాచలం ఆస్తులను, పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవడంపై చర్చించాం. ఇళ్లు నిర్మించుకున్న వారికి ఉపయోగపడే చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు. సమావేశంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డ్డి, అనకాపల్లి ఎంపీ వెంకటసత్యవతి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజు, ఏజీ శ్రీరాం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: