భారత నౌకాదళానికి చెందిన రణ్ విజయ్, కొరా యుద్ద నౌకలు పశ్చిమ పసిఫిక్లో ఫిలిప్పైన్ నేవీ నౌకలతో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. అంటోనియో లూనా యుద్ద నౌక పాల్గొంది. రెండు నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర సాంకేతిక అంశాల మార్పిడి వంటి వాటికి ఈ విన్యాసాలు అద్దంపట్టాయి. ఆసియా దేశాల నౌకాదళాలతో సుహృద్భావాన్ని పెంపొందించుకోవడం, అంతర్జాతీయ జలాల్లో నౌకాపరంగా భద్రత పెంపు వంటి చర్యలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పశ్చిమ పసిఫిక్లో భారత నౌకదళానికి చెందిన నౌకలు ఇప్పుడు మోహరించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఫిలిప్పైన్ నేవీతో చేసే విన్యాసాలు రెండు దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భద్రతా బలగాల అంచనా. మనీలా పోర్టుకు ఈ నౌకలు చేరుకున్నప్పుడు అక్కడ నౌకాదళ అధికారులతో వివిధ అంశాలపై భారత నౌకాదళం అధికారులు చర్చించారు. రెండు దేశాల మధ్య ఏళ్ల తరబడి ఉన్న నౌకాదళ సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే ఒప్పందాల అమలుపై చర్చించారు.