రాజకీయాల్లోకి వచ్చాక తనపైనా ఆరోపణలు వచ్చాయన్నారు.. భాజపా ఎంపీ సుజనా చౌదరి. మాజీ సభాపతి కోడెల బలవన్మరణంపై.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశానికి సుజనా హాజరయ్యారు. సమావేశంలో భాజపా ఎంపీ టీజీ వెంకటేష్, కంభంపాటి హరిబాబుతో పాటు.. పలువురు నాయకులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కోడెల మృతిపై 2 నిమిషాలు మౌనం పాటించి.. నివాళులు అర్పించారు.
ఇబ్బందులు సహజం
వ్యాపార రంగంలో ఆర్థిక ఇబ్బందులు సహజమని సుజనా చెప్పారు. ఆర్థిక నేరాలు చేయకుండా ఉండడమే కీలక అంశంగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు చలవతోనే వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. జాతీయ వాదానికి వెళ్లాలంటే జాతీయ పార్టీకి వెళ్లాలన్న సుజనా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని.. ప్రాంతీయ పార్టీల కాలపరిమితి పూర్తయిందని అభిప్రాయపడ్డారు. ఆర్థికవేత్తలు, వ్యాపార వేత్తలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. దేశంలో మరో పదేళ్లు భాజపా ఈ దేశంలో పాలించే అవకాశాలున్నాయని అంచనా వేశారు. విశాఖలో పారిశ్రామికవేత్తల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.