మద్యం షాపుల వద్ద కొవిడ్ నిబంధనలు గాలికొదిలేస్తున్నారని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం షాపుల రద్దీ, తోపులాటలు నిత్యం జరుగుతూనే ఉన్నాయన్నారు. కరోనా వ్యాప్తికి మద్యం షాపులు ప్రధాన కారకాలుగా మారాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. మద్యం దుకాణాలపై వాస్తవాలను సీఎంకు చేర్చడంలో ఇంటిలిజెన్స్ వ్యవస్థ విఫలమైందా అని ఆయన ప్రశ్నించారు.
కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రేషన్ సరకులు పెంచాలని గణబాబు కోరారు. కరోనాను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చినప్పటికీ కొన్ని ఆసుపత్రులలో అందుకు తగిన సదుపాయాలు లేవన్నారు. మిగిలిన అనారోగ్య సమస్యలకు కూడా చికిత్స అందించేందుకు కొవిడ్ ను సాకుగా చెబుతున్నారన్నారు.
రేషన్ ధరల పెంపు, పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్ విధించడం వంటి చర్యలతో మధ్యతరగతి ప్రజలపై అధికభారం పడుతుందని గణబాబు అన్నారు. వ్యాట్ పెంపుపై పునఃసమీక్షించాలని కోరారు.
ఇదీ చదవండి : విద్యార్థుల్లో 'లెర్న్ టు ఎర్న్'కు నాంది పడాలి: సీఎం జగన్