Visakha Second Day Bandh: కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా.. విశాఖలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో వేలమందితో భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల రక్షణ కోరుతూ ర్యాలీ తీశారు. విశాఖ రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఐకాస నాయకులు, కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఎల్‌ఐసీ, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
బంద్‌లో మొదటి రోజు: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల విశాఖ బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘ నాయకుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్లాంట్‌పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంటు సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని కార్మికులు ధ్వజమెత్తారు.
ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని కార్మిక సంఘ నాయకులు తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద తోపులాట జరిగింది. స్టీల్‌ప్లాంట్ వద్ద పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసున్నారు. విశాఖ ఆటోమోటివ్ కూడలిలో వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. వామపక్ష నేతలు సహా పలు కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మద్దిలపాలెంలో కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ సమితి నిరసన చేపట్టింది. సీపీఎం, ఏఐటీయూసీ నాయకుల అరెస్టు చేసి ఎంవీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్, జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద సీఐటియూ, ఏఐటిసి నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను ఆపడానికి ప్రయత్నించగా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. త్వరలో 100 మంది ఎంపీల సంతకాలు తీసుకుని దిల్లీ వెళ్లి పోరాట పటిమ చూపించడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక నేతలు తెలిపారు. కేంద్రం మళ్లీ పార్లమెంట్లో 'విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తాం' అనే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Lepakshi temple: యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షికి చోటు