ప్రతిపక్షాలు సహకరిస్తే 'అందరికి ఇల్లు' సాధ్యం అవుతుందని.. గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. విశాఖలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై మంత్రి సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి పేదవాడికి 15 లక్షల విలువైన ఆస్తి ఇవ్వడం ఈ పథకం లక్ష్యమని వివరించారు. నిర్మాణానికి ఇసుకను దగ్గర ప్రాంతాల నుంచి అందిస్తున్నట్టు చెప్పారు. ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ఏ ఇబ్బంది లేకుండా స్వయంగా పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఒక ఇంటి నిర్మాణం వల్ల 30 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీరంగనాథరాజు వివరించారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు నిర్మాణం జరిగితే... 4 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి సమకూర్చినట్టు అవుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ.200 కోట్లు బిల్లులు చెల్లించామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం కోసం విశాఖకు ఇబ్బంది లేకుండా శ్రీకాకుళం, రాజమహేంద్రవరం నుంచి ఇసుక సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. అర్హులకు లబ్ధి చేకూరకపోతే.. 90 రోజుల్లో తిరిగి దరఖాస్తు చేసుకొవచ్చని చెప్పారు. వాలంటీర్లు తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... cross firing: విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి