స్థిరాస్తి వ్యాపారం, భారీ నిర్మాణాలు, విల్లాలు, ప్రభుత్వ ప్రాజెక్టులను చేపట్టే ఓ నిర్మాణ సంస్థ జీఎస్టీ అధికారులకు మస్కా కొట్టింది. తరచూ కంపెనీ పేర్లను మారుస్తూ.. ఎవరూ త్వరగా గుర్తించకుండా జాగ్రత్తపడినా విశాఖపట్నం అధికారులు పట్టుకున్నారు. వివరాలను రాష్ట్ర పన్నుల శాఖ (జీఎస్టీ) సంయుక్త కమిషనర్ ఎన్.శ్రీనివాసరావు విశాఖలోని కార్యాలయంలో శనివారం వెల్లడించారు.
'విశాఖకు చెందిన మెస్సర్ శ్రీపాదా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.69 కోట్ల మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఈ తరహాలో ఎగవేత దక్షిణ భారతదేశంలో ఇదే మొదటిదిగా చెప్పొచ్చు. మాకు వచ్చిన సమాచారం మేరకు కొద్దిరోజుల నుంచి ఆ సంస్థపై నిఘా పెట్టాం. ఈనెల 26న ద్వారకానగర్ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో సీతమ్మధారలోని ఆ సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేశాం. దస్త్రాలు, లాభనష్టాల ఖాతా పుస్తకాలను సీజ్ చేశాం. 2016-17 నుంచి 2019-20 వరకు రూ.385.32 కోట్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఆదాయపన్ను చెల్లింపులో వాటి వివరాలను పేర్కొన్నప్పటికీ జీఎస్టీ చెల్లించలేదని గుర్తించాం. ఈ నాలుగేళ్ల కాలంలో చేసిన వ్యాపారాలకు రూ.69,06,85,140 వరకు జీఎస్టీ చెల్లించాలని అంచనా వేశాం. నిర్మాణ పనులను చేపట్టే ఈ సంస్థ నిర్వాహకులను గొలుగూరి శ్రీనివాసరెడ్డి, సూర శ్రీనివాసరెడ్డిగా గుర్తించాం. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే ఈ సంస్థ గతంలో ఇందిరమ్మ ఇళ్ల పనులు, బెంగళూరులోని ఉత్కల్ విల్లాలు, రియల్ ఎస్టేట్, ఇతర నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది. మొదట 2006లో మెస్సర్ యశ్వంత్ ఎంటర్‌ప్రైజెస్‌గా కంపెనీని ప్రారంభించారు. తర్వాత 2010లో మెస్సర్ యశ్వంత్ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా, 2012లో మెస్సర్ వైఈపీఎల్ ఇంజినీరింగ్ అండ్ కాంట్రాక్టర్స్ ప్రైవేటు లిమిటెడ్‌గా, 2016లో శ్రీపాదా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌గా నాలుగుసార్లు కంపెనీ పేర్లను మార్చారు. 2019 జనవరిలో కంపెనీని జీఎస్టీ చట్టం మేరకు రిజిస్ట్రేషన్ చేసి, అప్పటి లావాదేవీలకు సంబంధించిన రిటర్నులను సమర్పించినప్పటికీ జీరో టర్నోవర్‌గా చూపించారు. దీంతో అదే సంవత్సరం సెప్టెంబరులో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సైతం రద్దయింది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది' సంయుక్త కమిషన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు!