కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా విశాఖలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బం హరికి కొవిడ్‌తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా..ప్రయోజనం లేకపోయింది.
సబ్బం రాజకీయ ప్రస్థానం...
సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. 1952 జూన్ 1న జన్మించారు. కాంగ్రెస్ కార్యకర్తగా సబ్బం తన రాజకీయ ప్రస్థానాన్ని మెుదలుపెట్టారు. 1985లో విశాఖ నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. 1989 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించారు. 1995లో విశాఖ మేయర్‌గా పనిచేసిన సబ్బం... నగర అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు. 2009లో అనకాపల్లి నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరిన సబ్బం... 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చంద్రబాబు సంతాపం
సబ్బం హరి మరణం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, విశాఖ తెదేపా కార్యాలయంలో పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేతలు
సబ్బం హరి ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్ధ రాజకీయాలతో సబ్బం మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారన్నారు.
కరోనా బారినపడి సబ్బం హరి మృతిచెందడం బాధాకరమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంతా ఆశించామని..,ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు.
ఇదీ చదవండి:
నిద్రమాత్రలు మింగి మహిళ ఆత్మహత్య..బంధువులే కారణమంటూ సెల్ఫీ వీడియో