విజయసాయిరెడ్డి స్వయంగా వస్తే ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నానని తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. ప్రమాణాల సవాళ్ల నేపథ్యంలో విశాఖ జల్లా ఎంవీపీ కాలనీలోని తెదేపా కార్యాలయానికి వెళ్లారు. తాను విజయసాయిరెడ్డికి సవాల్ విసిరానని.. మిగతా వాళ్లకి కాదని తెలిపారు. సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలన్న వైకాపా నేతల సవాలును స్వీకరిస్తున్నామని వెలగపూడి అన్నారు. విజయసాయిరెడ్డి సింహాచలం వస్తారా అని ప్రశ్నించారు. విశాఖలోని ప్రశాంత వాతావరణం చెడగొట్టొద్దని సూచించారు.
భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయగా.. తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని వెలగపూడి సవాల్ విసిరారు. సవాల్ నేపథ్యంలో.. విశాఖ జిల్లా ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయిబాబా గుడి వద్దకు వచ్చిన వైకాపా నాయకురాలు విజయ నిర్మల.. వెలగపూడి రావాలని డిమాండ్ చేశారు. భయంతోనే ప్రమాణం చేయడానికి రాలేదని ఆరోపించారు. సాయిబాబా చిత్రపటంతో వెలగపూడి కార్యాలయానికి వెళ్తున్న ఆమెను, వైకాపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో విజయనిర్మల వెనక్కివెళ్లారు.
ఇదీ చదవండి: విశాఖలో టెన్షన్... ప్రమాణానికి సిద్ధమైన తెదేపా, వైకాపా నేతలు