2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వుల్ని ఏపీఈఆర్‌సీ బుధవారం విశాఖలోని తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఏపీఈఆర్‌సీ సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. అనంతరం జస్టిస్ నాగార్జునరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రెస్కోల్ని డిస్కంలకు అప్పగించే చర్య తాత్కాలికమేనని ఆ తర్వాత ఏంచేయాలో కోఆపరేటివ్ సొసైటీ చట్ట ప్రకారం సంబంధిత శాఖలే చూసుకోవాలని అన్నారు. లైసెన్సులు లేకుండా రెస్కోలు కార్యకలాపాలు కొనసాగించేందుకు చట్టం ఒప్పుకోదని తెలిపారు. తాజా విద్యుత్తు టారిఫ్ ఉత్తర్వుల్లో వినియోగదారులపై భారం పడకుండా చేశామని, రాష్ట్రంలోని 3 విద్యుత్తు పంపిణీ సంస్థలు.. రూ.11,741.18 కోట్ల లోటు ఉన్నట్లు అంచనాలు వేశాయని దీనిని లోతుగా పరిశీలించాక రూ.7,433.80 కోట్ల లోటును నిర్ణయించామన్నారు. ఉత్తర్వులోని మరిన్ని కీలక విషయాల్ని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో తూర్పు, మధ్య, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, జె.పద్మజనార్దన్‌రెడ్డి, హెచ్.హరినాథరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కీలకాంశాలివీ...
*గృహ వినియోగదారులు విద్యుత్తు వాడకున్నా గతంలో కనీస ఛార్జీలు విధించేవారు. సింగిల్‌ఫేజ్ ఇళ్లకు రూ.25 నుంచి రూ.50, త్రీఫేజ్ ఇళ్లకు రూ.150 కట్టాల్సి వచ్చేది. ఇకపై లోడును బట్టి కిలోవాట్‌కు నెలకు రూ.10 మాత్రమే భరించేలా మండలి నిర్ణయం తీసుకుంది. ఇది వినియోగదారులకు లాభించే అంశం. ఫంక్షన్‌హాళ్లు నడవకున్నప్పటికీ ఇదివరకు విధించిన నెలకు కిలోవాట్‌కు రూ.100 కనీస ఛార్జీల్ని ఎత్తివేశారు.
* చేప, రొయ్య పిల్లల పెంపకం, దాణా కేంద్రాల్ని, కోడిపిల్లల ఉత్పత్తి, వాటి దాణా కేంద్రాల్ని పరిశ్రమల సాధారణ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ కేంద్రాలు సొంతంగా ఎల్టీ కనెక్షన్లు ఉండి, జీఎస్టీ నుంచి మినహాయింపు ఉన్నట్లయితే.. యూనిట్‌కు రూ.5.25, కిలోవాట్‌కు రూ.75 చెల్లించేలా అనుమతులిచ్చారు.
* హెచ్‌టీ వినియోగదారులకు ఇదివరకు లోడ్‌కారక ప్రోత్సాహక పథకం (లోడ్‌ఫ్యాక్టర్ ఇన్సెంటివ్) ఉండేది. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిస్కంలు ప్రతిపాదించాయి. మండలి అంచనాల ప్రకారం కొన్ని నెలల్లో విద్యుత్తు కొరత ఉండబోతోందని తేలడంతో దీనికి ఆమోదముద్ర వేసింది.
*పాత, కొత్త బియ్యం మిల్లులు, పల్వరైజర్ మిల్లులు ఎల్‌టీ కనెక్షన్ పరిధిలో ఉండేందుకు గతంలో 100హెచ్‌పీ నుంచి 150హెచ్‌పీ దాకా కొన్ని షరతులతో మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు గతేడాది జూన్ 30 దాకానే ఐచ్ఛికంగా ఎంచుకునేందుకు గడువిచ్చారు. వినతులు రావడంతో ఈ ఏడాది జూన్ 30దాకా దాన్ని పొడిగించారు.
*విద్యుత్తు వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి గతేడాది తరహాలోనే యూనిట్‌కు రూ.6.70 కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఛార్జింగ్ కేంద్రాల నుంచి 90 శాతం ధరనే డిస్కంలు వసూలుచేయాలి.
* అపార్ట్‌మెంట్లలోని గృహాలకు వేర్వేరు కనెక్షన్లు కాకుండా మొత్తం సముదాయాన్ని ఒకే కనెక్షన్ కింద ఉంచాలన్న డిస్కంల ప్రతిపాదనల్ని ఏపీఈఆర్‌సీ తోసిపుచ్చింది. ప్రస్తుతం అపార్ట్‌మెంట్లలో మధ్యతరగతి కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారికి నష్టం జరుగుతుందని తాము భావించినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు.
ప్రభుత్వంపై భారం రూ.9 వేల కోట్ల పైనే
2021-22 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్తు రాయితీల కోసం రూ.9,091.36 కోట్లు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా.. డిస్కంలు భరిస్తున్న సగటు సేవా వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్)ను యూనిట్‌కు రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గించినట్లు తెలిపారు. కార్పొరేట్ రహిత రైతులు, చెరకు క్రషింగ్ యూనిట్లు, నర్సరీలు, దోబీఘాట్లకు 2021-22లోనూ ఉచిత విద్యుత్తు సరఫరా జాబితాలో కొనసాగేలా ఊరటనిచ్చామన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు ధరల్ని ఒకే తరహాలో ఉంచడానికి వీలుగా తూర్పు విద్యుత్తు పంపిణీ సంస్థ పరిధిలోని గృహ వినియోగదారులపై భారం పడింది. వీరికి రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.136.72 కోట్లు భరించనుంది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు విద్యుత్తు చట్టం సెక్షన్ 65 ప్రకారం తొలిసారిగా కొన్నివర్గాలను ఉచిత విద్యుత్తులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. హరిజన, గిరిజన నివాసాలు, తండాల్లోని గృహాలకు నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు, దారిద్య్రరేఖ దిగువనున్న లాండ్రీలు, వెనకబడిన వర్గాలకు, స్వర్ణకారులకు, నాయీబ్రాహ్మణులకు, చేపల, రొయ్యల చెరువులకు ఉచిత విద్యుత్తు రాయితీ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,657.56 కోట్లు భరించేందుకు అంగీకారం తెలిపిందన్నారు.
ఏపీఈఆర్‌సీ తిరస్కరించిన అంశాలు
* రోజువారీ ఆఫ్ పీక్ సమయం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ఉండేది. దీన్ని ఉదయం 4 నుంచి 8 గంటల మధ్యకు మార్చాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఇలా చేస్తే పరిశ్రమలు 2 గంటల ఆఫ్‌పీక్ సమయాన్ని కోల్పోతాయని, ఈ చర్యతో వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందని భావించింది. దీంతో ప్రతిపాదనను మండలి తిరస్కరించింది.
* పీపీఏల్లో లేని ప్రైవేటు విద్యుత్తు కేంద్రాలు 2021-22 ప్రణాళికల్లో చేర్చాలని అభ్యర్థించాయి. విద్యుత్తు కొనుగోలు ఖర్చును ఆదా చేయడానికి రియల్‌టైమ్ మార్కెట్‌లోకి డిస్కంలను అనుమతించడంతో వీరి అభ్యర్థను మండలి తిరస్కరించింది.
ముఖ్య ఆదేశాలు
* ఈమధ్యే జాతీయస్థాయిలో రియల్‌టైం మార్కెట్ స్థాపించారు. విద్యుత్తును నేరుగా కొనుగోలు చేసేందుకు, మిగులు విద్యుత్తును అమ్మేందుకు డిస్కంలకు ఈ అవకాశాన్నిచ్చారు. ఈ మార్కెట్‌ను 24×7 పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్‌ను పెట్టాలని డిస్కంలను ఆదేశించారు.
* పునరుత్పాదక విద్యుత్తు కొనుగోలు బాధ్యత (ఆర్‌పీపీవో)కు సంబంధించిన పీపీఏలను ఇదివరకే ఏపీఎస్పీడీసీఎల్‌కు అప్పగించారు. తూర్పు, మధ్య విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఈ రకమైన విద్యుత్తు కొనే అవకాశం లేదు. ఒకవేళ ఈ విద్యుత్తును కొనాలంటే మార్కెట్‌లో ‘పునరుత్పాదక విద్యుత్తు ధ్రువీకరణ పత్రాల్ని కొనుగోలు చేయాలి. వీటి ధర భారీగా ఉంటున్న నేపథ్యంలో ఆ భారం తగ్గించేందుకు ఎస్పీడీసీఎల్ దగ్గరే కొనుగోలు చేసేలా యూనిట్ ధరను రూ.2.43గానీ, రూ.2.44తో గానీ తీసుకునేలా ఆదేశాలిచ్చారు.
* వినియోగదారులకిచ్చే విద్యుత్తు బిల్లుల వెనక మరిన్ని వివరాలు ముద్రించాలని డిస్కంలకు ఆదేశాలిచ్చారు. సేవా వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్), క్రాస్ సబ్సిడీ, ప్రభుత్వ రాయితీ వివరాలూ అందులో ఉండాలన్నారు. మరోవైపు ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య చర్యల్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర విద్యుత్తు సమర్థత అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో)కు నిధులు మంజూరుచేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండీ... వైఎస్ఆర్ బీమా రూ.254 కోట్లు విడుదల