IIM Visakha: ఇండియన్ ఇన్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం సంచాలకునిగా డాక్టర్ ఎం.చంద్రశేఖర్‌ను కేంద్రం రెండో సారి నియమించింది. విశాఖలో ఐఐఎం ప్రారంభం నాటి నుంచి సంచాలకునిగా ఐదేళ్లపాటు బాధ్యతలను నిర్వర్తించిన డాక్టర్ చంద్రశేఖర్‌ను మరో ఐదేళ్ల పాటు ఆ పదవిలో నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేంద్రం ఉత్తర్వులతో రెండోసారి ఎం.చంద్రశేఖర్ ఆ బాధ్యతలను చేపట్టారు.
విశాఖ ఐఐఎం చంద్రశేఖర్ సారథ్యంలో వివిధ కొత్త కోర్సులను ఆరంభించడమే కాకుండా, పరిశోధకులకు కూడా అవకాశం కల్పించారు. జిల్లాలోని గంభీరం వద్ద దాదాపు 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సొంత క్యాంపస్ పనులు శరవేగంగా పట్టాలెక్కించి, నిర్మాణాలు వేగంగా జరిగేందుకు డాక్టర్ చంద్రశేఖర్ కృషి చేశారు. రెండోసారి డైరక్టర్‌గా ఆయన నియామకంపై ఐఐఎం ఆచార్యులు, సిబ్బంది అభినందించారు.
డాక్టర్ చంద్రశేఖర్ నేపథ్యం..
39 ఏళ్లపాటు అర్థిక రంగం, ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ సంస్థలతో పనిచేసిన ఆనుభవం ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి అఫ్ ఇండియాకు 15 ఏళ్లపాటు వివిధ విభాగాలకు సారథిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యున్నత కమిటీలలో చాలా వాటికి సారథ్యం వహించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి పిన్న వయసులో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా బాధ్యతలను నిర్వర్తించి, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో దేశంలోనే అతి తక్కువ వయసులో ఆ పదవిని అందుకున్న వ్యక్తిగా నిలిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా, జేఎన్టీయూ నుంచి ఎంటెక్ డిగ్రీ తీసుకున్నారు. ఐఐటీ దిల్లీ నుంచి మేనేజ్‌మెంట్‌లోనూ ఎంటెక్ పూర్తి చేశారు. బెంగళూరు ఐఐటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు.
ఇదీ చదవండి: Vishaka IIM: విశాఖ ఐఐఎం.. మిగిలిన సంస్థలకు ధీటుగా..