కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అన్ని రంగాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఏపీటీడీసీ మాత్రం మంచి లాభాల బాటలో కొనసాగుతోంది. కొవిడ్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న లక్షల మంది బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లతో ఆహారం సరఫరా చేసింది. ప్రస్తుతం రోజుకు 7 వేల 700 మందికి ఆహార పొట్లాలను సరఫరా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.7 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. 4 లక్షల మందికిపైగా బాధితులు పౌష్టికాహారాన్ని ఏపీటీడీసీ ద్వారా తీసుకున్నారు.
ప్రత్యేక శ్రద్ధతో అందిస్తున్న ఆహారం కొవిడ్ రోగులకు సాంత్వన కలిగిస్తోంది. మధ్యాహ్న భోజనంలో కోడి మాంసంతో పాటు వేపుడు కూర, పప్పు, అన్నం అందిస్తున్నారు. రాత్రి భోజనంలో చపాతి, కూర, పప్పు, పచ్చడి ఇస్తున్నారు. వీటితో పాటు రాగిజావ, మిరియాల పాలు, పండ్ల ముక్కలు, రోజుకు మూడు గుడ్లు ఇవ్వడంతో పాటు అల్పాహారం విషయంలోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారు. మొత్తం 8 జిల్లాల్లోని 11 కేంద్రాల నుంచి ఏపీటీడీసీ ద్వారా వివిధ ఆసుపత్రులకు ఆహారం సరఫరా అవుతోంది. మంచి ఆహారం అందించడం పట్ల కొవిడ్ రోగుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. పౌష్టికాహారం తీసుకోవడం కారణంగా త్వరగా కొలుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది.
ఇదీ చదవండీ... బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం