విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్ వేడుకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విశాఖ తీరంలో జరుగుతున్న మిలాన్ వేడుకలకు హాజరైన సీఎం.. వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. 'ఐఎన్‌ఎస్ విశాఖ', 'ఐఎన్‌ఎస్ వేల' చేరికతో సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైందన్నారు. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుందని జగన్ వెల్లడించారు.
"విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్ వేడుకలు జరుగుతున్నాయి. మిలాన్ వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయి. నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం వేదికైంది. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌక ఇటీవలే నౌకాదళంలో చేరింది. నౌకపై లైట్ హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణ జింకను చిత్రించారు. ఇటీవలే 'ఐఎన్‌ఎస్ వేల' సబ్‌మెరైన్ నౌకాదళంలో చేరింది. సబ్‌మెరైన్ రాకతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం మొదలైంది. నౌకల విన్యాసాలు విశాఖ ప్రజలకు ఉత్సాహం ఇస్తాయి. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుంది." -జగన్, ముఖ్యమంత్రి
ఐఎన్‌ఎస్ విశాఖపట్నం జాతికి అంకితం
సాయంత్రం నౌకాదళంలోని నావల్‌డాక్‌యార్డ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. సతీమణి భారతితో సహా ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను, ఐఎన్‌ఎస్ వేలా జలాంతర్గామిని సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, వైస్‌అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కనులపండువగా విన్యాసాలు
‘మిలాన్’లో భాగంగా నిర్వహించిన విన్యాసాలు అబ్బరపరిచాయి. ‘హాక్’ యుద్ధవిమానాలు వాయువేగంతో వేదిక సమీపంలోని ఆకాశంలో ప్రయాణించడం, ఓ యుద్ధ విమానం రాకెట్ తరహాలో నిలువునా దూసుకుపోవడం, ఆ క్రమంలో అది గుండ్రంగా తిరుగుతూ ప్రయాణించిన దృశ్యాలు కనులపండువ చేశాయి. విమానంనుంచి పారాచూట్ల సాయంతో మెరైన్ కమాండోలు కిందికి దూకి కచ్చితంగా ముఖ్యమంత్రి వేదిక ముందు దిగిన దృశ్యం ఆకట్టుకుంది. నౌకాదళానికి చెందిన చేతక్‌లు, సీకింగ్‌లు, యూహెచ్3హెచ్‌లు, కమోవ్, అత్యంత అధునాతన ఏఎల్‌హెచ్ హెలీకాప్టర్లు, డోర్నియర్ నిఘా విమానాలతో ఫ్లైపాస్ట్ నిర్వహించారు. మిగ్ యుద్ధవిమానాలు బాంబులు కురిపించేలా పేలుడు పదార్థాలను ఆకాశం నుంచి వదిలాయి. ‘అంతర్జాతీయ నగర కవాతు’లో పలు దేశాల నౌకాదళాలతో సహా భారత నౌకాదళం, నౌకాదళ విశ్రాంత ఉద్యోగుల బృందాలు, కళాకారుల ప్రదర్శనలు ప్రధానాకర్షణగా నిలిచాయి.
నౌకాదళాల పరస్పర సహకారానికి ‘మిలాన్’
పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో ఆయా దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం అవసరం. దీనికి ‘మిలాన్’లాంటివి వేదికగా నిలుస్తాయి. మన దేశంతోపాటు అన్ని నౌకాదళాలు అభివృద్ధి చెందాలని, ప్రయోజనం పొందాలన్న సమున్నత ఆశయంతో కార్యక్రమాన్ని ప్రయోజనకరంగా నిర్వహిస్తున్నాం. భారతదేశం అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానాలున్న ‘గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్’ యుద్ధనౌకను 75శాతం స్వదేశీ సామగ్రి, పరిజ్ఞానాలతో దేశంలోని మజ్‌గాన్‌డాక్ షిప్‌యార్డ్‌లో నిర్మించింది. దీనికి ఐఎన్‌ఎస్ విశాఖపట్నం అని పేరు పెట్టాం. దీన్ని ముంబయి కేంద్రంగా మోహరించాం. మిలాన్ భాగంగా నిర్వహించే ‘అంతర్జాతీయ సదస్సు’లలో నౌకాదళాలు ఎదుర్కొంటున్న సవాళ్లేమిటి? వాటి పరిష్కారాలపై నిపుణులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తాం. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్
సముద్రయాన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
సముద్రయాన ప్రజాస్వామ్యం (మారిటైం డెమోక్రసీ) దెబ్బతినడం ఆందోళనకర పరిణామం. సముద్రాల్లోని కొన్ని ప్రాంతాలపై ఆధిపత్యం సాధించాలని, సముద్ర ఆధారిత వనరులను అవసరానికి మించి వాడుకోవాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది వివాదాలకు కారణమవుతోంది. సముద్ర ప్రాంతాల్లో సంచారం, వనరుల వినియోగంపై ప్రపంచ దేశాల అంగీకారంతో ఐక్యరాజ్యసమితి పలు నిబంధనలను అమలుచేస్తోంది. వాటిని అన్ని దేశాలవారూ పాటిస్తే ఉద్రిక్తతలకు తావుండదు. చైనా అంతర్జాతీయ ఒడంబడికలను ఉల్లంఘిస్తుండటం ఆందోళనకు కారణమవుతోంది. - యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ పాపరో
ఇదీ చదవండి
అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఆ ఇంటర్వ్యూలు రద్దు